వైఎస్సార్‌టీయూసీ క్యాలెండర్ ఆవిష్కరణ
సింథియా: హిందుస్థాన్ షిప్‌యార్డ్ వైఎస్సార్‌టీయూసీ నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్‌ను ఎంపీ గొల్ల బాబూరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్లను యూనియన్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. షిప్‌యార్డ్ మినీరత్న స్థాయికి ఎదగడంలో యాజమాన్యం, కార్మికుల కృషిని అభినందించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ముఖ్యంగా ఎల్‌అండ్‌ఎం సిరీస్ కార్మికుల సమస్యలపై త్వరలోనే షిప్‌యార్డ్ ఉన్నతాధికారులతో చర్చిస్తానని, వారిని పర్మినెంట్ చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల ప్రమోషన్లు, కార్మికులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. షిప్‌యార్డ్ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో షిప్పింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ను, రక్షణ శాఖ పరిధిలోకి తీసుకురావడంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషిని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


