పరిజ్ఞానంతో పాటు ఫలితాలు కీలకం
ఎంపీ శ్రీ భరత్
బీచ్‌రోడ్డు: నేటి ప్రపంచంలో కేవలం సిద్ధాంత పరిజ్ఞానం లేదా మంచి ఉద్దేశాలు ఉంటే సరిపోదని, వాటి ద్వారా వచ్చే ఫలితాలే అత్యంత కీలకమని ఎంపీ శ్రీభరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏస్టీపీఐ సహకారంతో ఏపీ డిజిటల్ టెక్నాలజీ పరిశ్రమల నెట్‌వర్క్(ఏపీడీటీఐ) ఆధ్వర్యంలో ‘ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 26’, ‘ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్ 26’ శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్ట్రన్స్ ఎరీనాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బియాండ్ ఆటోమేషన్: ది ఇంటెలిజెంట్ ఎరా’అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సులో ఐటీ, ఏఐ, డీప్‌టెక్ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా చర్చలు సాగుతాయన్నారు. ఏఐ వంటి సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచం వేగంగా మారుతోందని, ఈ మార్పులకు అనుగుణంగా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని పిలుపునిచ్చారు. సమయాన్ని ఒక విలువైన కరెన్సీలా భావించాలని సూచించారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు పారిశ్రామిక మార్పులను గమనిస్తూ, తమను తాము అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కోసరాజు మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐల రాకతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయన్నారు. ఇవి కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, స్వయంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎస్టీపీఐ డైరెక్టర్ సి.కవిత, హెచ్‌సీఎల్ టెక్ ప్రతినిధి చెరుకూరి కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


