చోరీ కేసులో ముగ్గురు మహిళల అరెస్టు
నిందితులపై 26 పాత కేసులు
గాజువాక : స్థానిక బీసీ రోడ్‌లోని ఓ జ్యూయలరీ షాప్‌లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గాజువాక క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గాజువాక క్రైం ఎస్‌ఐ సీహెచ్.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌టీఆర్ జిల్లా వీరుల్లపాడు మండలం గోకరాజుపల్లి గ్రామానికి చెందిన పొన్న పద్మ (45), బొజ్జగాని జ్ఞానమ్మ (55), బొజ్జగాని నాగమణి (50) బీసీ రోడ్‌లోని శ్రీలక్ష్మీ శ్రీనివాస జ్యూయలరీ షాప్‌నకు వెళ్లి చెవి దిద్దులు చూపించమని అడిగారు. వారు కోరిన ఆభరణాలను దుకాణదారుడు ఒక ట్రేలో పెట్టి చూపించగా, అవి నచ్చలేదని వారు వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తరువాత ట్రేను పరిశీలించగా, నాలుగున్నర గ్రాముల విలువైన రెండు సెట్ల చెవి దిద్దులు మాయమైనట్టు గుర్తించి గాజువాక క్రైం పోలీసులకు దుకాణదారుడు ఉరుకూటి రాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాజువాక మెయిన్ రోడ్‌లో గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు దొంగతనానికి పాల్పడింది వారేనని నిర్ధారించుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారిపై గతంలో కూడా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడిన 26 కేసులున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


