కనకమహాలక్ష్మికి తుమ్మిడి బ్రదర్స్ నెక్లెస్ బహూకరణ
డాబాగార్డెన్స్: సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారికి తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్‌కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు బుధవారం బంగారు నెక్లెస్‌ను బహూకరించారు. సుమారు రూ.2.12 లక్షల విలువ చేసే 13.623 గ్రాముల ఈ బంగారు హారాన్ని ఆలయ ఈవో కె.శోభారాణికి అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దాతల గోత్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్ మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని, 2026లో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తుమ్మిడి బ్రదర్స్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. సంస్థ ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ఈ హారాన్ని కానుకగా సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


