మ్యూల్ అకౌంట్ సరఫరా చేసే వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ : డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.11 లక్షలను కాజేశారు. దీనిపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు జమ చేసిన ఖాతా వివరాలను పరిశీలించగా.. ఆ అకౌంట్ యజమాని వరంగల్ జిల్లాకు చెందిన కొండ్లె రాజశేఖర్(35)గా పోలీసులు గుర్తించారు. అధిక కమీషన్‌కు ఆశపడి తన బ్యాంక్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.


