బడిలో బాహాబాహీ
ఆరిలోవ: తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఈ గొడవలో ఒక విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేయడంతో రెండు పళ్లు విరిగిపోయాయి. వివరాలివి. పాఠశాలలో ఒక సెక్షన్‌కు చెందిన విద్యార్థి రామచంద్రరావుకు, మరో సెక్షన్‌కు చెందిన విద్యార్థికి మధ్య మాటామటా పెరిగి కొట్లాట మొదలైంది. రెండో సెక్షన్ విద్యార్థి తన స్నేహితులను పిలిపించుకుని రామచంద్రరావుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ముఖంపై బలంగా కొట్టడంతో రామచంద్రరావు నోటిలోని పైవరుస పన్ను సగానికి, కింద పన్ను లోపలికి విరిగిపోయాయి. నుదుటిపై కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రామచంద్రరావు తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. గాయపడిన తమ కుమారుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా, పాఠశాలలోనే మోకాళ్లపై నిలబెట్టి ఉంచారని తండ్రి ఆకుల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులను నిలదీసినా సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ తర్వాత వెంటనే బాలుడిని విమ్స్‌కు, అక్కడి నుంచి గీతం దంత వైద్యశాలకు తరలించారు. రెండు పళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వారం రోజుల చికిత్స తర్వాత కొత్త పళ్లు అమర్చాలని వైద్యులు సూచించినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. దీనిపై ఆరిలోవ పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే గొడవ సద్దుమణగడంతో తిరిగి వెళ్లిపోయారు. కాగా..ఈ ఘటన గురించి విద్యా శాఖాధికారులకు హెచ్‌ఎం తెలియజేయకపోవడం గమనార్హం.
పోలీసులకు సమాచారం ఇచ్చాం
ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎం భవాని స్పందిస్తూ.. ‘విద్యార్థులు కొట్టుకున్న విషయం తెలియగానే వారిని ఆఫీస్ గదికి పిలిపించాం. ఎవరినీ మోకాళ్లపై నిలబెట్టలేదు. ఆస్పత్రికి తీసుకువెళ్దామని అనుకుంటుండగానే విద్యార్థి తల్లి వచ్చారు. వెంటనే ఆరిలోవ సీఐకి సమాచారం ఇచ్చాం. పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారు. విద్యార్థులు గొడవపడిన విషయం తల్లిదండ్రులకు ఎలా తెలిసిందో మాకు అర్థం కావడం లేదు’అని తెలిపారు.


