స్టీల్‌ప్లాంట్ భూములపై కార్పొరేట్ల కన్ను
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తపల్లి లోకనాధం, కార్పొరేటర్ బి.గంగారావు ఆరోపించారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్లాంట్‌ను రక్షిస్తామని చెబుతూనే ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు 9 జిల్లాల పరిధిలో ఎకనామిక్ రీజియన్ పేరుతో 232 పేజీల ప్రణాళికను విడుదల చేసిందని వారు తెలిపారు. ఇందులో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన దాదాపు 2,500 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు బదలాయించే ప్రతిపాదనలు ఉన్నాయని వారు బయటపెట్టారు. ప్లాంట్‌కు ఉన్న రూ.2,400 కోట్ల విద్యుత్ బకాయిలను సాకుగా చూపి, వాటిని ఈక్విటీగా మార్చుకుని భూములను స్వాధీనం చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. కోక్, సింటర్ వంటి ముడిసరుకులను సొంతంగా ఉత్పత్తి చేసుకోకుండా, బయట నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తూ ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్ను కోక్‌పై రూ.8 వేలు, పెల్లేట్స్‌పై రూ.2 వేలకు పైగా అదనపు భారాన్ని మోపుతూ, ముడిసరుకు వ్యయాన్ని 60 శాతం నుంచి 78 శాతానికి పెంచేశారని ఆరోపించారు. గతంలో ఎన్‌ఎండీసీకి లీజుకు ఇచ్చిన 1,100 ఎకరాలు, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న 2,500 ఎకరాలు కలిపి మొత్తం అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ దుర్మార్గపు ప్రతిపాదనలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఉక్కు భూములను కేవలం ప్లాంట్ విస్తరణకే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిటూ నాయకులు నమ్మి రమణ, ఎన్.రామారావు, సీపీఎం నాయకుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం ధ్వజం


