ఆయుర్వేదం ముసుగులో నకిలీ దందా
తాటిచెట్లపాలెం: ఆయుర్వేద వైద్యం పేరుతో నకిలీ నూనెలు, పొడులు విక్రయిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శ్రీనగర్‌లోని ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌పై దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి బుధవారం మీడియాకు వెల్లడించారు. దాసిక కల్యాణ ఆనంద శంకర ప్రసాద్ అనే వృద్ధుడు హైడ్రోసిల్ సమస్యతో బాధపడుతున్నారు. గత నెల 22న సీతమ్మధార సిగ్నల్ జంక్షన్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని సంప్రదించాడు. ఆయుర్వేద మందుల ద్వారా నయం చేస్తామని నమ్మబలికాడు. అనంతరం గత నెల 23న శ్రీనగర్‌లోని ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్రసాద్ అనే వ్యక్తి.. బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా రూ. 1.6 లక్షలు వసూలు చేసి, రసీదు ఇచ్చారు. ఆయుర్వేద మందులను ఇచ్చి కొన్ని రోజులు వాడాలని సూచించారు. అయితే మందులు వాడినా జబ్బు నయం కాకపోవడంతో బాధితుడు ఆరా తీయగా, తనలాగే మరికొందరిని కూడా ఈ ముఠా మోసం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన ద్వారకా పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ టాస్క్ ఫోర్స్, ద్వారకా పోలీసులు సంయుక్తంగా ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్‌పై దాడి చేశారు. అక్కడ నకిలీ మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్న సుధాం దుర్గప్ప గోల్లర్, ప్రభు కల్లోలప్ప, దురగప్ప గొల్లా, గొల్లర్ గుర్రన్న, బాగల్‌కోటి సోమప్పలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో ద్వారకా సీఐ డి.వి.రమణ, ఎస్‌ఐ అసిరి తాతల పాల్గొన్నారు.


