సివిల్స్‌లో మనోళ్లు మెరవాలి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
కొమ్మాది: సివిల్స్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సత్తా చాటాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం రుషికొండలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్స్ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.4.22 కోట్ల వ్యయంతో మూడు చోట్ల కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో తరగతులు ప్రారంభం కాగా, తాజాగా విశాఖ కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. మొత్తం 340 మంది అభ్యర్థులకు (ఒక్కో కేంద్రంలో సుమారు 100 మంది) ఉచిత శిక్షణతో పాటు వసతి, నాణ్యమైన ఆహారం, స్టడీ మెటీరియల్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విద్యార్థుల కోసం మాక్ టెస్టులు, లైబ్రరీ సౌకర్యంతో పాటు నిష్ణాతులైన మెంటర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏజెన్సీలో రూ.1,300 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు, ఫీడర్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించేందుకు ఇలాంటి కోచింగ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదాభార్గవి, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


