9, 10 తేదీల్లో లైట్ హౌస్ ఫెస్టివల్
మహారాణిపేట: విశాఖపట్నం వైభవాన్ని మరింత చాటిచెప్పేలా పోర్టు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10వ తేదీల్లో ఎంజీఎం పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ఏర్పాట్లపై లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పోర్ట్ అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని వెల్లడించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని, బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర యాదవ్, విశాఖ పోర్టు కార్యదర్శి సాంబమూర్తి, సీఏవో రమణమూర్తి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వికాశ్, విశాఖపట్టణం ఆర్డీవో సుధాసాగర్, జీవీఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


