విశాఖలో ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ) సహకారంతో ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ(ఏపీడీటీఐ) ఆధ్వర్యంలో ఏపీ ఇన్నోవేటర్స్ సమ్మిట్–2026, ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఈ సమ్మిట్స్ జరగనున్నాయనీ ఏపీడీటీఐ నెట్‌వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ సమ్మిట్స్‌కు సహకారం అందిస్తోందని వెల్లడించారు. ‘ఆటోమేషన్‌కు అతీతంగా, మేధో యుగం – ఆవిష్కరణలు, డీప్‌టెక్ నైపుణ్యాల సమన్వయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సాధికారత కల్పించడం అనే థీమ్‌తో సదస్సులు జరగనున్నాయని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు, అభివృద్ధికి దిక్సూచీగా విశాఖ నగరం విరాజిల్లుతున్న తరుణంలో డిజిటల్ టెక్నాలజీలోని ఐటీ, ఐటీ అనుబంధ, ఏఐ–ఎమర్జింగ్ టెక్, ఇండస్ట్రీ–4.0, మెడ్‌టెక్ – హెల్త్‌టెక్, క్రియేటివ్ టెక్ మొదలైన 6 రంగాలను మిళితం చేసేలా మొట్టమొదటిసారిగా ఈ సదస్సు జరగనుందన్నారు. సదస్సును ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఈఆర్‌పీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించనున్నారని తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లకు 10వ తేదీన వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు చైర్మన్ శ్రీధర్ కొసరాజు వెల్లడించారు.


