
ఆకట్టుకున్న జానపద కళా సంబరాలు
ఆరిలోవ: ఉత్తరాంధ్ర నవ చైతన్య కళా నాట్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 13వ వార్డు ఆరిలోవ కాలనీ శివాజీనగర్–2లోని ముత్యాలమ్మ గుడి వద్ద జానపద కళా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కళాకారులు పలు జానపద కళలు ప్రదర్శించి స్థానికులను ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు, జానపద పాటలు అలరించాయి. కళాకారులకు నృత్యాలు, జానపద పాటలు, నాటికల ప్రదర్శన, కోలాటం తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఉత్తరాంధ్ర జానపద కళలను ప్రదర్శించి, పరిచయం చేయాలని ఆశిస్తున్నానన్నారు.