మా పరిస్థితి ఏంటీ భరత్‌? | - | Sakshi
Sakshi News home page

మా పరిస్థితి ఏంటీ భరత్‌?

Jul 22 2024 12:54 AM | Updated on Jul 22 2024 1:16 PM

మా పరిస్థితి ఏంటీ?

మా పరిస్థితి ఏంటీ?

ఎంపీ భరత్‌ను నిలదీసినపలు వార్డుల టీడీపీ అధ్యక్షులు 

 వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు చేరితే మేం ఒప్పుకోమని తెగేసి చెప్పిన గాజువాక నేతలు 

మహరాణిపేట: ‘‘ఎంపీ సార్‌.. మీరు కండువా కప్పేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. పార్టీని వార్డుల్లో నిలబెట్టేందుకు ఎన్నో అష్టకష్టాలు పడ్డాం. ఇప్పుడు మళ్లీ ఆ కార్పొరేటర్లే వార్డులో పెత్తనం చెలాయిస్తారు. అధికారంలో ఉన్నా.. మా పరిస్థితి అగమ్య గోచరమేనా. మా భవిష్యత్తు ఆలోచించరా.?’’ అంటూ టీడీపీ కార్యాలయంలో ఎంపీ భరత్‌ను వివిధ వార్డులకు చెందిన టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశం ఉత్కంఠగా సాగింది. 

పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలు,ఎంపీ సమక్షంలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో కొంత మంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిరసన గళం విప్పారు. తమ అభిప్రాయాలు కనీసం తెలుసుకోకుండా.. కార్పొరేటర్లకు కండువా కప్పడంపై ఆయా వార్డులకు చెందిన అధ్యక్షులు, సీనియర్‌ లీడర్లు అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే తమ వార్డుల్లో పెత్తనం సాగించారని, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా.. వాళ్లే ముందు వరసలో ఉండేందుకే పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ వ్యవహారాలు చక్కపెట్టుకోడానికే తప్ప.. పార్టీ మీద గౌరవంతో రాలేదని వ్యాఖ్యానించారు.

 ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే వాళ్లు ఇప్పడు కూడా మాపై పెత్తనం చేస్తారని.. ఇప్పుడు మేమేం చెయ్యాలంటూ 30వ వార్డుకు చెందిన టీడీపీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్‌ పోలిపల్లి జ్యోతి ఎంపీ భరత్‌ను నిలదీశారు. వాళ్లంతా శత్రువులు వారిని ఎలా చేర్చుకుంటారని వివిధ వార్డులకు చెందిన మహిళా కార్యకర్తలు భరత్‌ను చుట్టుముట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ భరత్‌ వారిని వారించి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఎవ్వరికీ అన్యాయం చెయ్యమని వెళ్లిపోడానికి ప్రయత్నించిన ఎంపీ భరత్‌కు కార్యాలయం ఆవరణలోనూ అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు.

టీడీపీలో చేరిన వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్లో పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆదివారం టీడీపీ పంచన చేరారు. జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కంపా హనోక్‌తో పాటు కార్పొరేటర్లు కోడూరు అప్పలరత్నం, సారిపల్లి గోవింద్‌, బొడ్డు నరసింహప్రసాద్‌, ఇల్లపు వరలక్ష్మీ, లొడగల అప్పారావు, రాజాన రామారావు చేరారు. వీరంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ఎంపీ భరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

వ్యక్తిగత కారణాలతోనే..
సీతమ్మధార: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడంపై ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కేకేరాజు స్పందించారు. వైఎస్సార్‌సీపీ టికెట్లు ఇచ్చి గెలిపించిందని, గెలిచిన కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.

గాజువాకలోనూ లుకలుకలు..!
మరోవైపు గాజువాక నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం జిల్లా పార్టీ పెద్దల వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లు బొడ్డు నర్సింహపాత్రుడు, ఇల్లపు లక్ష్మి, రాజన రామారావు టీడీపీలోకి చేరడంతో నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. వారిని ఎలా చేర్చుకుంటారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నిలదియ్యాలని నిర్ణయించుకున్నారు. 

ఆయన వస్తే గాజువాక పార్టీ కార్యాలయంలో పంచాయితీ పెడతామని నియోజకవర్గంలోని నేతలు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ నుంచి కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారన్న సమాచారం రావడంతో వారిని చేర్చుకోవద్దంటూ కొందరు టీడీపీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి లేఖలు రాశారు. అయితే కార్పొరేటర్ల రాకతో అసంతృప్తితో ఉన్న టీడీపీ వార్డు స్థాయి నేతలను బుజ్జగించే పనిలో ఎమ్మెల్యేలున్నారు. ఇదిలా ఉండగా టీడీపీలో చేర్చుకోమని చెప్పిన వారంతా జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement