ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా

Published Sat, Apr 20 2024 1:15 AM

-

మహరాణిపేట: ఎన్నికల సమయంలో అభ్యర్థులతోపాటు ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు రంగ రాజన్‌, భీమిలి, తూర్పు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండేజైన్‌, ఉత్తర, పశ్చిమ, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు అక్తా జైన్‌తో కలిసి శుక్రవారం జిల్లాలో నీనా నిగం పర్యటించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అధికారులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీనా నిగం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలు పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌, ఎంసీసీ నోడల్‌ అధికారి, జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, ఏడీసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి ఆమెకు వివరించారు.

క్షేత్రస్థాయిలో చర్యలు, సేవలు

కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ 11 చోట్ల చెక్‌ పోస్టులు పెట్టామని, ఇప్పటి వరకు వస్తు, ధన రూపంలో రూ.4.92 కోట్ల నగదును సీజ్‌ చేశామని తెలిపారు. మొత్తం 110 రకాల బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయని వివరించారు. 24/7 పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది నోడల్‌ అధికారులను నియమించామని, 502 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, 1,457 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ–విజిల్‌ ద్వారా 388 వినతులు రాగా.. 285 వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనల్లో 59 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు.

బాధ్యతగా ఎన్నికల విధులు

జిల్లా అధికారులతో

రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం

నియోజకవర్గాల వారీగా సమీక్షలు

Advertisement
 
Advertisement