గత అలైన్‌మెంట్‌లో ఒకటి రెండు గ్రామాలకే పరిమితం నూతన ప్రతిపాదనలో50కి పైగా ఊళ్లకు ఎఫెక్ట్ ఏకమైన భూ బాధితులు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నా
వికారాబాద్: జిల్లాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు జిల్లా మీదుగా వెళ్లేలా ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్ తయారు చేయడమే ఇందుకు కారణం. ఫైనల్ రూట్‌మ్యాప్ తయారు చేయడంతో పాటు భూ సేకరణకు అధికారులను నియమించింది. ఓ పక్క భూ సేకరణకు కసరత్తు చేస్తుండగా.. భూ బాధితులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల బాధిత రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటై పో రాట కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. వీరికి పలు పార్టీల నాయకులు, అడ్వకేట్లు మద్దతు తెలిపారు.
అడిషనల్ కలెక్టర్‌కు వినతి
రీజినల్ దక్షిణ రింగ్ రోడ్డుకు సంబంధించి తుది అలైన్‌మెంట్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఈ చర్చ మొదలైంది. రియల్టర్లు, ప్రజా ప్రతినిధుల నోట ట్రిపుల్ ఆర్ మాటే వినిపిస్తోంది. ప్రతిపాదిత గ్రామాలు, భూముల సర్వే నంబర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన డీపీఆర్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డు పడమర ప్రాంతంలో మన జిల్లాకు దిగువన రంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి వెళ్లేలా తయారు చేశారు. మన జిల్లాకు సంబంధించి ఒకటి రెండు గ్రామాల మీదుగా మాత్రమే వెళ్లేది. ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చడంతో జిల్లాలోని 23 గ్రామాల మీదుగా వెళ్తుండగా 50 గ్రామాలకు పైగా ట్రిపుల్ ఆర్ లోపలికి వస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో పోయే భూముల సర్వే నంబర్లు గ్రామాల పేర్లు కూడా సూచించటంతో రైతుల్లో తమ భవిష్యత్ ఏంటనే ఆందోళన మొదలైంది. రైతుల అభ్యర్థనను ప్రభుత్వానికి పంపుతామని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు.
అధికారులు, నేతల చుట్టూ..
పొలాలు పోతున్న రైతులు అధికారులు, నేతల చుట్టూ తిరుగుతున్నారు. రిజినల్‌కు సంబంధించి నూతనంగా ప్రతిపాదించిన రూట్ మ్యాప్‌ను నెట్‌లో అప్‌లోడ్ చేశారు. రింగ్‌రోడ్డు వెళ్లే గ్రామాల రైతుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో తమ గ్రామానికి ఎటు వైపు నుంచి వెళ్తుంది.. ఎవరిలో పొలాల్లోంచి వెళ్తుంది.. తమ పొలంలోంచి వెళ్తుందా అనే చర్చ జరిగేది. ప్రస్తుతం స్పష్టత రావటంతో బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. తమ గ్రామం మీదుగా వెళ్లాలి.. అభివృద్ధి జరగాలి.. కానీ తమ పొలం పోకూడదని వేడుకుంటున్నారు. జిల్లా వాసులందరు రీజినల్ రింగురోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరగా వెళుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తుండగా.. పొలాలు కోల్పోనున్న రైతులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పాత అలైన్‌మెంట్ మార్చడానికి గల కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు, వారి బంధువుల భూములకు ఇబ్బంది కలగకుండా అలైన్‌మెంట్ మార్పులు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. వీటిపై ప్రభు త్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తమకున్న కొద్దిపా టి వ్యవసాయ భూములు పోతే కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూము లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. భూ బాధితులందరినీ సమన్వయం చేసుకుంటూ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
రియల్టర్ల జోరు
గత డీపీఆర్‌లో పొందుపర్చిన అలైన్‌మెంట్‌లో పడమర ప్రాంతంలో మన జిల్లా సరిహద్దు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆలూరు – కౌకుంట్ల గ్రామాల మధ్యలోంచి తంగెడుపల్లి మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల్లో మన జిల్లాకు చెందిన పూడూరు, నవాబుపేట మండలాలకు చెందిన ఒకటి రెండు గ్రామాల్లోంచి వెళ్లేలా డిజైన్ చేశారు. తాజాగా ప్రతిపాదనల్లో జిల్లాలోని నాలుగు మండలాలను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వెళ్తుంది. పూడూరు, నవాబుపేట మండలాల పరిధిలోని 20కి పైగా గ్రామాలు రీజినల్ పరిధిలోకి వస్తుండగా వికారాబాద్, మోమిన్‌పేట మండలాల పరిధిలోని ఐదారు గ్రామాలను కలుపుతూ వెళ్లేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో రియల్టర్ల జోరు ఊపందుకుంది. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అందుబాటులో ఉన్న సమాచారంతో ట్రిపుల్ ఆర్ ఏయే గ్రామాలు, గ్రామాలకు ఎటు వైపు నుంచి వెళుతుందనే విషయాన్ని అంచనా వేస్తూ ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోళ్లకు యత్నిస్తున్నారు. కొన్ని చోట్ల అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం.
భూ సేకరణ చేయనున్న గ్రామాల రైతుల్లో ఉత్కంఠ


