బుసకొడుతున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

బుసకొడుతున్నాయ్‌!

Nov 24 2026 4:16 PM | Updated on Nov 24 2026 4:16 PM

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు మూడు నెలల్లో వందకుపైగా నమోదు ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు పలు హాస్పిటళ్లలో యాంటీ స్నేక్‌ వీనం టీకా కరువు సకాలంలో చికిత్స అందక పలువురి మృత్యువాత

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకప్పుడు ప్రకృతి రమణీయంగా కన్పించిన శివారు ప్రాంతాల్లోని కొండలు, గుట్టల్లో, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు వెలుస్తున్నాయి. ఎత్తైన కొండలు, గుట్టలు, దట్టమైన చెట్ల పొదల మధ్య అప్పటి వరకు స్వేచ్ఛగా విహరించిన అడవి జంతువులు సహా పాములు జనావాసాల మధ్యకు వచ్చి బుస కొడుతున్నాయి. పొట్టకూటి కోసం ఆయా వెంచర్లలో పని చేస్తున్న కూలీలను కాటేస్తున్నాయి.

శీతాకాలంలోనూ భారీగా నమోదు

సాధారణంగా మే, జూన్‌, జూలై మాసాల్లో నమోదు కావాల్సిన పాముకాటు కేసులు శీతాకాంలోనూ భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

టీకా లేక..

ఉమ్మడి జిల్లాలోని కొడంగల్‌, తాండూరు, పరిగి, వికారాబాద్‌, మర్పల్లి సహా యాచారం, షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంప ట్నం ఆస్పత్రుల్లో నెలకు సగటున 20 నుంచి 25 పాముకాటు కేసులు నమోదవుతుండటం విశేషం. యాంటీ స్నేక్‌వీనం టీకా అందుబాటులో లేకపోవడం, ఉన్నచోట వైద్యులు స్పందించక పోవడం వెరసి బాధితుల మృత్యువాతకు కారణమవుతోంది.

ఇండెంట్‌ పెట్టడమే ఆలస్యం

‘వికారాబాద్‌ జిల్లాలో నెలకు సగటున వంద వాయిల్స్‌ యాంటీ స్నేక్‌ వీనం అవసరం. వీటిలో ఒక్క తాండూరులోనే 60 నుంచి 70 వాయిల్స్‌ ఖర్చవుతుంటాయి. జిల్లాలో యాంటీ స్నేక్‌వీనం టీకాలు లేవనడంలో నిజం లేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్‌ వచ్చిన వెంటనే సమకూరుస్తున్నాం’ అని వికారాబాద్‌ జిల్లా డ్రగ్స్‌ స్టోర్స్‌ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి చెప్పారు. ‘రంగారెడ్డి జిల్లాలో నాలుగు వేలకుపైగా ఇంజక్షన్లు అవసరం ఉంటుంది. డిమాండ్‌ మేరకు సరఫరా చేస్తున్నాం’ అని జిల్లా డ్రగ్స్‌ అండ్‌ స్టోర్స్‌ ఇన్‌చార్జి అశోక్‌ స్పష్టం చేశారు.

పల్లెకు పాముకాటు

నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌ మండలం తేట్‌పల్లికి చెందిన వరికుప్పల రవి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం కొత్తూరుకు చేరుకున్నాడు. శివారు ప్రాంతంలో కొంత భూమిని లీజుకు తీసుకుని బ్రిక్స్‌ తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. గతనెల రాత్రి భోజనం చేసిన తర్వాత అంతా నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే నేలపై ఘాడనిద్రలో ఉన్న కుమార్తె హరిణి(4)ని పాము కాటేసింది. చికిత్స కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు తరలించారు. ఆస్పత్రిలో యాంటీ స్నేక్‌ వీనం టీకా లేకపోవడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్సలో జాప్యానికి తోడు అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి చిన్నారి మృత్యువాతపడింది.

బిహార్‌కు చెందిన రోహణ్‌(18) బతుకుదెరువు కోసం యాచారం మండలం గడ్డమల్లాయగూడకు చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిరాడు. పనిలో నిమగ్నమైన సమయంలో పాము కాటేసింది. ఇరుగు, పొరుగు వాళ్లు గమనించి చికిత్స కోసం వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలోని సిబ్బంది యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ ఇచ్చి తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు.

తాండూరు మండలం జనగామ శివారులో హైదరాబాద్‌కు చెందిన మొయినొద్దీన్‌ వ్యవసాయ క్షేత్రంలో రంగారెడ్డి జిల్లా గుర్రంపల్లికి చెందిన నర్సమ్మ (26) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పని చేస్తోంది. సెప్టెంబర్‌ 23న వ్యవసాయక్షేత్రంలోని గదిలో నిద్రిస్తున్న నర్సమ్మను పాముకాటేసింది. చికిత్స కోసం తాండూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం వికారాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, మార్గ మధ్యలోనే మృత్యువాతపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement