షాద్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి నిషాంత్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో వానాకాలం పంటల ప్రణాళికపై రైతులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ నిషాంత్‌కుమార్ మాట్లాడుతూ.. బోర్లలో నీటి శాతం తక్కువగా ఉండటంతో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. జొన్న, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, కంది, ఆయుధం, పొద్దుతిరుగుడు, తదితర పంటలను సాగు చేయాలని కోరారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రైతులు వరినాట్లు వేయాలన్నారు. నారుమడిని తేమతో రక్షించాలని సూచించారు. నేల పరీక్ష ఆధారంగా రైతులు ఎరువులు వాడాలని, తేమ ఉన్నప్పుడు మాత్రమే యూరియా వేయాలని సూచించారు. జీవ ఎరువులు, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని రైతులు పెంచాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీకాంత్, రైతులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మండల వ్యవసాయాధికారి నిషాంత్‌కుమార్


