ఓట్లు కాపాడుకునే పనిలో ఆయా పార్టీలు
వికారాబాద్: అందరి దృష్టి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పైనే ఉంది. అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సర్ కార్యక్రమం పేరిట ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. పార్టీ నాయకులకు శిక్షణ ఇస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సర్వే చేస్తోంది. ఓటర్ల మ్యాపింగ్, ఇంటింటి సర్వేపై బీఎల్‌ఓలకు శిక్షణ తరగతులు పూర్తి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 77.65 శాతం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. నేటి నుంచి(గురువారం) బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బీఎల్‌ఓలలో ఎక్కువ శాతం అంగన్‌వాడీ కార్యకర్తలు ఉండటం.. వారిలో కొందరు సాంకేతికతను అందిపుచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వారికి అర్థం కాక వారి కుమారులు, కూతుళ్లతో సర్వే చేయిస్తున్నట్టు సమాచారం.
అక్టోబర్ ఒకటిన తుది జాబితా
చివరి సారిగా 2002లో ఎస్‌ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత 2025లో సర్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2002లో నమోదైన ఓటర్ల జాబితాను ప్రామానికంగా తీసుకుని 2025 ఓటరు జాబితాతో పోల్చి చూస్తున్నారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, బోగస్ ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. వారికి నోటీసులు ఇచ్చి తాము భారత పౌరులమే అని నిరూపించుకోకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని తెలియజేస్తున్నారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జూలై 31న ఓటరు జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం వెళ్లడించనుంది. ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కరించి అక్టోబర్ ఒకటిన తుది జాబితాను ప్రకటించనున్నాయి.
77.65శాతం మ్యాపింగ్ పూర్తి
జిల్లాలో 10,17,671 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,87,495 మందికి సంబంధించి(77.65 శాతం) మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరో 2,27,454 మందికి మ్యాపింగ్ చేయాల్సి ఉంది. వికారాబాద్ నియోజకవర్గంలో 1,84,674 మంది(79.98 శాతం)ఓటర్లకు, పరిగి నియోజకవర్గంలోని 2,32,111 మంది(84.8 శాతం), తాండూరులో 1,65,637 మంది(66.29 శాతం), కొడంగల్‌లో 2,00073 మంది ఓటర్లు(79.78 శాతం) సంబంధించిన మ్యాపింగ్ పూర్తయ్యింది.
బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమాలు
పార్టీ అనుకూల ఓట్లపై నేతల ప్రత్యేక దృష్టి
జిల్లాలో మొత్తం ఓటర్లు 10,17,671
ఇప్పటి వరకు మ్యాపింగ్ చేసింది 77.65శాతం
నేటి నుంచి ఇంటింటి సర్వే
ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
పార్టీల ప్రత్యేక దృష్టి
సర్ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి సబితారెడ్డికి అప్పగించారు. ఈ నెల 26న పరిగిలో, 28న వికారాబాద్‌కు నాయకులకు అవగాహన కల్పించనున్నారు. ఇందు కోసం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రానున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. వారికే సర్ బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు సర్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.


