రేపు పరిగికి కేటీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు పరిగికి కేటీఆర్‌

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

రేపు పరిగికి కేటీఆర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభం విజయవంతం చేయాలి ఇంటింటి గణన పక్కాగా ఉండాలి: డీఆర్‌ఓ గిన్నిస్‌ రికార్డు విజేతకు సన్మానం

పరిగి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం పరిగి పట్టణానికి రానున్నట్టు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ బీఎల్‌ఏల సమన్వయ శిక్షణ, సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎస్‌ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

కొడంగల్‌: పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ను బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.1.85 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కొడంగల్‌ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి అధిక నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ గుప్తా, కమిషనర్‌ బలరాం నాయక్‌, కౌన్సిలర్లు కృష్ణంరాజు, హమీద్‌, బత్తుల అనిత, గొల్ల లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవం సందర్భంగా వెటర్నరీ ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

అనంతగిరి: పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎస్పీ స్నేహమెహ్ర బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. గురువారం వికారాబాద్‌లోని బ్లాక్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్‌ టీం, ప్రెస్‌ టీం, డాక్టర్స్‌ టీం, అడ్వకేట్స్‌ టీం, కలెక్టర్‌ కార్యాలయం టీం, మున్సిపల్‌ టీంలు పాల్గొంటాయన్నారు. 26న ఎరోబిక్స్‌, జుంబా కార్యక్రమాల తోపాటు 2కే రన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

బంట్వారం: ఎస్‌ఐఆర్‌ ఇంటింటి గణన పక్కాగా నిర్వహించాలని డీఆర్‌ఓ స్వర్ణలత అన్నారు. బుదవారం కోట్‌పల్లి రెవెన్యూ కార్యాలయంలో సూపర్‌ వైజర్లు, బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆనంద్‌రావు తదితరలు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌: పట్టణానికి చెందిన యువకుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. బైక్‌పై ఏకంగా 19వేల ఫీట్ల ఎత్తు పైన ఉన్న పర్వత మోటారు రహదారిని అధిరోహించాడు. తాండూరులోని శ్రీభావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ పూజారి మడపతి విజయ్‌ కుమార్‌, బస్వరాజమ్మ (ప్రసన్న) దంపతుల కుమారుడు మడపతి వినయ్‌ కుమార్‌ ఎంఫార్మసీ చదువుతున్నాడు. ఈ నెల 13న జమ్మూ కాశ్మీర్‌లోని లడాక్‌ సరిహద్దులో 19,024 ఫీట్ల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్‌లా అనే ఎత్తైన మోటారు వాహన రహదారిని బైకుపై అధిరోహించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. అత్యంత సాహసోపేతమైన, ఆక్సిజన్‌ సరిగా అందని, ఎత్తైన రహదారికి బైకుపై చేరుకున్న వినయ్‌కుమార్‌ను స్థానిక వీరశైవ సమాజ సభ్యులు అభినందిస్తూ బుధవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తానని వినయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement