తల్లిడిల్లుతున్న చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

తల్లిడిల్లుతున్న చిన్నారులు

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

బషీరాబాద్‌: కూలి పనికి వెళ్లిన మహిళ అదృశ్యమై 16 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులను కలవరపెడుతోంది. ఆమె మొబైల్‌ ఫోన్‌ మూడు రోజుల క్రితం అనుమానితుడి వద్ద లభించింది. తల్లి కోసం ఇద్దరు చిన్నారులు ఇంటి దగ్గర ఎదురుచూస్తుండగా, అసలు నిజం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మండలంలోని జీవన్గీ గ్రామానికి చెందిన ఎనుముల మహేశ్వరి(35) ఈ నెల 8న కూలి పనుల నిమిత్తం వికారాబాద్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చసి దర్యాప్తు చేపట్టారు. మహేశ్వరి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా వివరాలను పోలీసులు పరిశీలించారు. కాల్‌ లిస్ట్‌ ఆధారంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ గ్రామానికి చెందిన బెంజిమెన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద మహేశ్వరి మొబైల్‌ ఫోన్‌ లభించినట్లు తెలిసింది. అయితే వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఫోన్‌ దొరికిందని, ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్తుండటం చూశానని బెంజిమెన్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు అతడిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

పిల్లల నిరీక్షణ

మహేశ్వరి భర్త అంజిలప్ప గతంలో మృతిచెందాడు. మహేశ్వరి కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలు అలకనంద(10), భువనేశ్వరి(12)ని పోషిస్తోంది. తల్లి కనిపించకుండా పోవడంతో ఇద్దరు చిన్నారులు ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేసి మహేశ్వరి ఆచూకీ కనుక్కోవాలని కోరుతున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు. కాల్‌ డేటా, సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నామని, త్వరలో కేసును కొలిక్కి తెస్తామని తెలిపారు.

16 రోజుల క్రితం అమ్మ అదృశ్యం

కన్నీటి పర్యంతమవుతున్న ఇద్దరు బిడ్డలు

అనుమానితుడి వద్ద లభించిన మొబైల్‌ ఫోన్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

తండ్రి చనిపోయాడు.. కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి 16 రోజులుగా కనిపించకుండా పోయింది.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు అమ్మ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారిని కదిలిస్తే గుండెపగిలేలా రోదిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement