‘కేపీ లక్ష్మీదేవిపల్లి’తో సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

‘కేపీ లక్ష్మీదేవిపల్లి’తో సస్యశ్యామలం

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

పరిగి: కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి ఽశంకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అనంతరం మండల పరిధిలోని సయ్యద్‌పల్లిలో రిజర్వాయర్‌ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పరిగి, షాద్‌నగర్‌, వికారాబాద్‌, చేవెళ్ల, తాండూరు నియోజకవర్గాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూగర్భ జలాలు పెరగడంతోపాటు తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదని మండి పడ్డారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. ప్రాజెక్టును పూర్తి చేసితీరుతామని స్పష్టం చేశారు. జిల్లాకు కృష్ణా తోపాటు గోదావరి జలాలు తెస్తామని తెలిపారు. భూ సేకరణకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10,000 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు చేసే త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనకు స్ఫూరి అన్నారు. ఎలాంటి పదవులు లేకున్నా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement