తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలోని మహిళా సంఘం భవనం ప్రహరీని శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడంతో వివాదానికి దారి తీసింది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా, ఎలా కూల్చివేస్తారని గ్రామస్తులు మండిపడ్డారు. 25 ఏళ్లుగా ఈ భవనంలోనే 50 సంఘాలకు పైగా మహిళలు ఇక్కడ సమావేశం అవుతుంటారు. ఇటీవల పోస్టాఫీస్ వినియోగానికి మహిళా సంఘాలు, గ్రామస్తులు అభిప్రాయం మేరకు కేటాయించారు. దీని మరమ్మతుల కోసం పలువురు దాతల సహకారం తీసుకున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు విస్తరణ పేరుతో కొందరు అధికారులపై ఒత్తిడి తేవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రహరీని కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్న స్థలాన్ని పరిరక్షించాలని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


