తుర్కయంజాల్: వివాదాస్పద స్థలంపై నిషేదాజ్ఞలు అమలు చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి ప్రయత్నించిన ఘటన రామన్నగూడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సర్వే నంబర్ 338లోని 1,810 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం సాగుతోంది. 2005లో అల్లూరి వెంకట రమణ రాజు అనే వ్యక్తి ఈ సర్వే నంబర్‌లోని కొంత భూమిని కాశీవిశ్వనాథ్‌కు ఏజీపీఏ చేశారు. దీని ఆధారంగా అతను ప్లాట్లను విక్రయించగా, సరస్వతి అనే మహిళతో పాటు, మరికొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఇదే సర్వేనంబర్‌లోని భూమిని 2011లో వెంకటపతి రాజు అనే వ్యక్తి జైపాల్‌రెడ్డికి విక్రయించాడు. అనంతరం ఆయన మరో ఇద్దరికి జీపీఏ చేసినట్లు సమాచారం. దీంతో సదరు స్థలం మాదంటే.. మాదేననే గొడవ సాగుతోంది. ఇందులో కట్టిన నిర్మాణాలను కొంతమంది వ్యాక్తులు ఆరు నెలల క్రితం కూల్చివేయగా, పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈవివాదంపై ఆదిబట్ల పోలీసులు ఇటీవల ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగే వరకు ఈభూమిపై బీఎన్‌ఎస్‌ఎస్ 164 సెక్షన్ విధించాలని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి నిర్ణయించారు. దీన్ని అమలు చేయడానికి శుక్రవారం ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్, జీపీఓ హనుమంతు నాయక్ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు మహిళ అధికారులను దుర్భాషలాడుతూ, చొక్కా, కాలర్ పట్టుకుని లాగింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని జీపీఓ హన్మంతునాయక్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన మహిళను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈవిషయమై పూర్తిస్థాయి విచారణ జరిపి, కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
రెవెన్యూ సిబ్బందిపై మహిళ దురుసు ప్రవర్తన


