● విషతుల్యమైన దాణా తిని ఏడు ఆవులు, లేగ దూడకు అస్వస్థత
● చికిత్స అందిస్తుండగానే మృత్యువాత
● కేసు నమోదు చేసిన పోలీసులు
కొత్తూరు: దాణాను విషతుల్యం చేయడంతో తన ఏడు ఆవులు, ఓ లేగ దూడ మృతిచెందాయని బాధిత రైతు వాపోయాడు. ఇందుకు కారణమైనవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమ్మరిగూడకు చెందిన రఘునందన్ కొన్నేళ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులోని డెయిరీ ఫామ్ వద్ద బీహార్‌కు చెందిన మున్నా, రాజు అనే ఇద్దరు కూలీలతో పనులు చేయిస్తున్నారు. వీరిరువురూ గురువారం చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో అప్పటికే సంపులో పులియబెట్టిన దాణాను రఘునందన్ శుక్రవారం మధ్యాహ్నం ఆవులకు పెట్టి, ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వెళ్లే సరికి కడుపు ఉబ్బిన ఆవులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాయి. వెంటనే పశువైద్యులకు సమాచారం ఇవ్వగా, చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఏడు ఆవులు, ఓ లేగదూడ చనిపోయాయి. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. దాణా సంపులో యూరియా అవశేషాలు ఉన్నట్లు పశువైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. సీఐ నర్సయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందిన తర్వాతే కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెటర్నరీ డాక్టర్ పద్మిణి తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బాధిత రైతు రఘునందన్, నాయకులు ఈట గణేశ్, దేవేందర్‌యాదవ్, కోస్గి శ్రీనివాస్, రాజేందర్, రవినాయక్, తదితరులు పరామర్శించారు.


