బజ్జీలకు ఫేమస్
● బషీరాబాద్‌లో ప్రతి మంగళవారం తైబజార్
● మండల స్థాయిలోనే అతి పెద్ద మార్కెట్
● రూ.లక్షల్లో వ్యాపారం
బషీరాబాద్: మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే సంతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బషీరాబాద్ తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఉండటంతో రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకు వస్తుంటారు. ఇక్కడ రైతులే నేరుగా కూరగాయలు విక్రయిస్తుంటారు. తక్కువ ధర.. తాజా కూరగాయలు లభిస్తుండటంలో ప్రజలు క్యూ కడుతున్నారు. ఒకేసారి వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. సంతలో గుండు సూది మొదలుకొని పెళ్లి వస్త్రాలు, వంట సామగ్రి, గృహోపకరణాలు, వ్యవసాయ పనిముట్లు, నిత్యావసర సరుకులన్నీ లభిస్తాయి. రెండు రాష్ట్రాలకు చెందిన 50 గ్రామాల ప్రజలు ఈ సంతకు వస్తుంటారు. బషీరాబాద్ మండలంతో పాటు అయ్యాళం, ఆబుళం, అల్కోడ, పోతంగల్, జెట్టూరు, లోహడ, రాజోళ్లి, సోంపల్లి, మద్దుకంటి, కురుగుంట, కొంతంపల్లి తదితర గ్రామాల నుంచి దాదాపు పది వేల మంది వస్తారు.
తగ్గని ఆదరణ
సంతలో రూ.లక్షల వ్యాపారం జరుగుతుంది. సూపర్ మార్కెట్లు వెలసినా తైబజార్‌కు ఆదరణ తగ్గడం లేదు. తాండూరు సమీపంలోని సుద్ధ, నాపరాయి తదితర గనుల్లో పని చేసే కూలీలకు మంగళవారం సెలవు కావడంతో కార్మికులు మార్కెట్ బాట పడతారు. వీరే కాకుండా రోజువారి కూలీలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతకు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
పల్లె రుచులు
మిరపకాయ బజ్జీలతో పాటు మటన్ సీకులు, బోటీ కూర ఇక్కడ ప్రత్యేకలు. బజ్జీలు తింటూ పల్లె సుద్దులు, పాత జ్ఞాపకాలు, కుటుంబ విషయాలు పంచుకుంటారు. సంత కేవలం వ్యాపార కేంద్రంగానే కాకుండా సామాజిక బంధాలను బలపరిచే వేదికగా మారింది.
సౌకర్యాలు శూన్యం
తైబజార్, దుకాణాల ట్రేడ్ లైసెన్సుల ద్వారా ఏటా గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. కానీ సంతలో కనీస వసతులు కూడా కల్పించడం లేదు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక ఇటు వ్యాపారులు, అటు కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతకంటూ ప్రత్యేక స్థలం లేకపోవడంతో పోస్టాఫీసు గల్లీ, మసీదు గల్లీల్లో నిర్వహిస్తున్నారు. అంగడి రోజు ఈ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతకు ప్రత్యేక స్థలం కేటాయిచడంతోపాటు వసతులు కల్పించాలని వ్యాపారులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు.
బషీరాబాద్ సంత అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మిరపకాయ బజ్జీలే. సంత వీధుల్లో అడుగు పెట్టగానే వేడి వేడి బజ్జీల సువాసన ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రతి హోటల్‌లో బజ్జీల విక్రయం జోరుగా సాగుతుంది. మంగళవారం అయితే వీటికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ వ్యాపారం కూడా వేలల్లో జరుగుతుంది.


