మొయినాబాద్: ధర్మాన్ని రక్షించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆంజనేయులు గురుస్వామి 8 నెలల పాటు 25,200 కిలోమీటర్ల పాదయాత్రతో 18 శక్తిపీఠాలను దర్శించుకుని గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, బజరంగ్ దళ్ కార్యాకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ ఆయన్ను సన్మానించి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం రంగరాజన్ మాట్లాడుతూ.. దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారత దేశ ప్రజలను కలిపేది దైవ సన్నిధానాలేనన్నారు. దేశాన్ని ఏకం చేసేది శక్తిపీఠాలు, దేవాలయాలు, ప్రార్థన స్థలాలని చెప్పారు. ధర్మాన్ని రక్షించడంకోసం ఆంజనేయులు పాదయాత్ర చేశారని.. ఈ యాత్రతో అందరిలో సద్భావన రావాలని ఆకాంక్షించారు. ఆంజనేయులు గురుస్వామి మాట్లాడుతూ.. లోక కల్యాణం, గో సంరక్షణ, దేశ ప్రజలందరు బాగుండాలనే ఆలోచనతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. శుక్రవారం శ్రీశైలంలో పాదయాత్ర అధికారికంగా ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సురేష్ శర్మ, బాలస్వామి, బజరంగ్ దళ్ నాయకులు నందకిషోర్, విజయ్, పాండు, శ్రీనివాస్ ఉన్నారు.


