ఫలితం కోసం ఆత్రుత వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫలితం కోసం ఆత్రుత వద్దు

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

అమ్మ చెప్పిన నీతి కథ

బొంరాస్‌పేట: ఓ మారుమూల గ్రామంలో నివసించే పార్వతమ్మకు కూతురు తులసి, కొడుకు రాము ఉండేవారు. తులసి చాలా తెలివైన అమ్మాయి. కానీ ఏ పని చేసినా త్వరగా ఫలితం రావాలని ఆత్రుతపడేది. ఒకరోజు పార్వతమ్మ ఇంటి పెరట్లో మామిడి విత్తనం(పీచు) నాటుతుండగా పిల్లలిద్దరూ గమనించారు. ‘అమ్మా, ఇది ఎప్పుడు మొక్కవుతుంది..? ఎప్పుడు పెద్దగా మారి పండ్లనిస్తుందని..? అని అడిగింది తులసి. అప్పుడు తల్లి నవ్వుతూ, పాప తల నిమురుతూ.. ‘రోజూ నీళ్లు పోసి, ప్రేమగా చూసుకుంటే సమయం వచ్చినప్పుడు నీడనూ, పండ్లనూ, శుభకార్యాలకు అవసరమైన కొమ్మలను ఇస్తుంది’ అని చెప్పింది. మూడు రోజుల తర్వాత పెరట్లోకి వెళ్లిన తులసి అమ్మా ఇంకా మొక్క ఎందుకు రాలేదు అని అడిగింది. అప్పుడు తల్లి బిడ్డను దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది.. ‘బంగారం.. ప్రకృతిలో మంచి విషయాలన్నీ నెమ్మదిగా పెరుగుతాయి. విత్తనం ఒక్కరోజులోనే మొక్క కాదు.. మొక్క ఒక్కరోజులోనే చెట్టుకాలేదు. అలాగే మన మంచితనం, చదువు, గౌరవం కూడా క్రమంగా పెరుగుతాయి. ఓపికతో నిజాయితీగా కష్టపడిన వారికే మంచి ఫలితం దక్కుతుంది’ అని చెప్పింది. ఈ మాటలను గట్టిగా గుర్తుంచుకున్న తులసి నిత్యం మామిడి పాదులో నీళ్లు పోసింది. అలా కొద్ది రోజులకు మొక్క వచ్చింది. ఇలా కొంత కాలం గడవగానే మొక్క చెట్టుగా ఎదిగింది. మూడేళ్ల అనంతరం కాయలు, పండ్లను కాసింది. ఓ రోజు తల్లితో కలిసి చెట్టు నీడలో కూర్చున్న పిల్లలు ఇలా అన్నారు.. ‘అమ్మా.. చెట్టు మాత్రమే కాదు, నీ మాటలు కూడా మమ్మల్ని ఇంకొకరికి నీడనిచ్చేలా పెంచాయి’. అని తల్లిని హత్తుకున్నారు. చెట్లకు కాసిన పండ్లను రాల్చి తినుకుంటూ ఇంట్లోకి వెళ్లారు.

నీతి: ఓపిక, క్రమశిక్షణ ఉంటే చిన్న విత్తనంలాంటి మనిషి కూడా మహా వృక్షంగా మారుతాడు

Advertisement
 
Advertisement
Advertisement