
నిరుపేద కుటుంబానికి అండ
పరిగి: నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ప్రకటించారు. పట్టణ కేంద్రానికి చెందిన నారాయణ, అతని కుమారుడు, కోడలు, మనవడు ఇల్లు లేక శ్మశానవాటికలో ఆరు నెలలుగా ఉంటుండంతో ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శనివారం వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడి వైద్య ఖర్చులకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నారాయణ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయిన నారాయణ మనువడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పట్టణ కేంద్రంలో స్థలాన్ని సేకరించి కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు నిర్మించే విధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులను నిర్వహించాలని ఎలాంటి అవకతవకలు జరిగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఎంహెచ్‌ఓ లలితాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, తహసీల్దార్ వెంకటేశ్వరి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్