గంజాయి.. జంగ్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి.. జంగ్‌

Jun 19 2025 7:56 AM | Updated on Jun 19 2025 7:56 AM

గంజాయి.. జంగ్‌

గంజాయి.. జంగ్‌

వికారాబాద్‌: జిల్లా కేంద్రంలో గంజాయి లొల్లి దుమారం రేపుతోంది. పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కారులో గంజాయి ప్యాకెట్‌ లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు. పట్టణ కేంద్రంలో రాష్ట్ర పోలీస్‌ డీజీపీ జితేందర్‌ విలేకరుల సమావేశంలో డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యమని ప్రకటించిన రోజునే వైద్యుడి కారులో గంజాయి పట్టుబడింది. దీంతో ప్రజలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తుండగానే కేసు పక్కదారి పట్టింది. మంగళవారం రాత్రి వైద్యుడి కారులో గంజాయి లభించగా.. ఇదే విషయమై డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో పలువురు వైద్యులు బుధవారం ఎస్పీ నారాయణరెడ్డిని కలిశారు. పోలీసులు దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయం ప్రస్తుతం పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు పోలీసులను ప్రశంసిస్తుండగా.. వైద్యుల వాదనలు విన్నాక పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

వీడియో రికార్డు బయటపెట్టండి

ఉదయం ఎస్పీ నారాయణరెడ్డిని కలిసిన వైద్యుల సంఘం సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులే తమ వాహనంలో గంజాయి ప్యాకెట్‌ పెట్టి తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారన్నారు. ఒక వేళ గంజాయి లభ్యమై ఉంటే వీడియో రికార్డు ఉంటుందని.. అది బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను బయట పెట్టాలని కోరుతున్నారు.

లేడీ డాక్టర్‌పై ఆరోపణలు

తాము రాత్రి 8.30గంటల నుంచి వాహనాల తనిఖీ చేపట్టామని 9.30–10గంటల ప్రాంతంలో ఎస్‌ఐ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే డాక్టర్‌ కారు రావడంతో డిక్కీలో తనిఖీ చేయగా ఓ బ్లాక్‌ కవర్‌లో గంజాయి లభ్యమైందని పోలీసులు పేర్కొంటున్నారు. వైద్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపడేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యురాలే ఈ మొత్తం ఘటనకు కారణమని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉండే ఓ డివిజన్‌ స్థాయి పోలీస్‌ అధికారి తన కింది స్థాయి సిబ్బందితో ఈ డ్రామా ఆడించారని ఆరోపిస్తున్నారు.

పరిగి ఘటన మాదిరిగానే..

పరిగిలో ఓ మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడికి చెందిన కారులో గంజాయి ఉందనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. కాగా మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు కావాలనే తన కారులో గంజాయి పెట్టి తనను ఇరికించేందుకు యత్నిస్తున్నాడని మరో యువకుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారించగా.. చివరకు వేరే వ్యక్తి కారులో గంజాయి ఉంచినట్లు సీసీ పుటేజీలో బయటపడింది. కాగా పోలీసులే ప్రమోషన్‌ కోసం తనతో గంజాయి పెట్టించారని యువకుడు ఆరోపించాడు. దీన్ని పోలీసులు ఖండించారు.

ఓ డాక్టర్‌ కారులో లభ్యమైన ప్యాకెట్‌

పోలీసులే పెట్టారంటూ వైద్యుల ఆరోపణలు

పోలీస్‌ వర్సెస్‌ వైద్యులుగామారిన పంచాయితీ

ఎస్పీని ఆశ్రయించిన డాక్టర్ల సంఘం

వైద్యుడిపై కేసు

సాధారణ తనిఖీల్లో భాగంగానే మంగళవారం రాత్రి వికారాబాద్‌ పట్టణంలో వాహనాల తనిఖీ నిర్వహించాం. ఆ సమయంలో వైద్యుడు ప్రదీప్‌ తన కారులో ప్రయాణిస్తుండగా ఎస్‌ఐ వాహనాన్ని తనిఖీ చేశారు. నేను కూడా సమీపంలోనే ఉన్నాను. కారు డిక్కీలో ఓ బ్లాక్‌ కవర్‌ ఉండడం గమనించి బయటకు తీసి చూడగా గంజాయి లభించింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.

– భీంకుమార్‌, సీఐ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement