పన్నుల వసూలులో దూకుడు
వికారాబాద్: పన్నుల వసూలులో జిల్లా పంచాయతీ విభాగం దూకుడు ప్రదర్శించింది. మొదట్లో కాస్త వెనకబడినట్లు కనిపించినా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వేగం పెంచడంతో టార్గెట్‌కు దగ్గరగా వచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి గ్రామ పంచాయతీలు పన్నుల వసూలులో లక్ష్యానికి చేరువయ్యాయి. రెండు నెలల క్రితం వరకు 50శాతం వసూళ్లకే పరిమితమైన యంత్రాంగం ఆ తర్వాత వేగం పెంచింది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, నిరంతర సమీక్షలు పన్నుల వసూలుకు కలిసొచ్చాయి. పంచాయతీ కార్యదర్శులకు పనిఒత్తిడి ఉన్నా అధిగమించి పురోగతి సాధించారు. పది రోజుల క్రితమే ఆర్థిక సంవత్సరం ముగియగా 93శాతం పన్నులు వసూలు చేశారు.
వందశాతానికి చేరువలో..
జిల్లాలో 20 మండలాలు 594 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2,22,954 నివాసాలు ఉన్నాయి. పంచాయతీలు, మండలాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. రూ.9.68 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో పాత బకాయిలు రూ.32.52 లక్షలు ఉండగా రూ.9 కోట్లు వసూలు చేశారు. పన్నులు, ఇతర ట్యాక్సెలు కలిపి 93 శాతం వసూలయ్యాయి. బంట్వారం, కోట్‌పల్లి, వికారాబాద్ మండలాల్లో వంద శాతం చేరుకున్నారు. యాలాల 86 శాతం, పెద్దేముల్ 87 శాతం, దౌల్తాబాద్ 88 శాతం వసూలు చేశారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 93 శాతం టార్గెట్ పూర్తి
లక్ష్యం రూ.9.68 కోట్లు.. వసూలు చేసింది రూ.9 కోట్లు
మూడు మండలాల్లో వంద శాతం పూర్తి
లక్ష్యం చేరుకుంటాం
జిల్లాలో పన్నుల వసూలు 93 శాతం దాటింది. నాన్ ట్యాక్సుల వసూలులో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. త్వరలో 100 శాతం లక్ష్యం చేరుకుంటాం. ఈ దిశగా సిబ్బంది పని చేస్తోంది. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నాణ్యమైన సేవలు పొందాలి.
– జయసుధ, డీపీఓ


