కారుమబ్బులు.. రైతన్న గుబులు
దౌల్తాబాద్: గత మూడు రోజులుగా పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతమవుతోంది. చల్లని గాలులతో పలుచోట్ల వానలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు సాగు చేశారు. సరిగ్గా ప్రతిఫలం చేతికందే సమయంలో అకాల వర్షాలకు దిగులు చెందుతున్నారు. మండలంలోని గ్రామాల్లో యాసంగి సాగు చేసిన వరి పంట చేతికందనుంది. మరో వారంలో కోతలు షురూ కానున్నాయి. ఇప్పటికే హార్వెస్టర్లతో కోతలు కోయడానికి పంటలు ఆరబెడుతున్నారు. వాతావరణ మార్పులు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఆందోళన చెందుతున్నా. పంటకోసే సమయంలో వరుణ దేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు.
5వేల ఎకరాల్లో సాగు
మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో యాసంగిలో బోరుబావులు, చెరువుల కింద సుమారు 5వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. ఈర్లపల్లి, అంతారం, నందారం, చల్లాపూర్ తదితర గ్రామాల్లో మరో రెండు మూడు రోజుల్లో పంట కోత కోయడానికి రెడీగా ఉంది. ఇంతలో ఆకాశంలో కారుమబ్బులు అకాల వర్షాలకు వరికోయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే పంట పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల కింద వరకు చాలా మంది రైతులు బోర్లలో నీరు లేక ఓ వైపు ఇబ్బందులు పడితే.. ప్రస్తుతం వానలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే పంట నేలకొరిగితే పొలాల్లో నీరు నిలిస్తే హార్వెస్టర్లతో కోయడానికి కష్టంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
పంట చేతికందే సమయంలో
వర్షాల ముప్పు
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
కోయాలో వద్దో..
యాసంగిలో సాగు చేసిన వరి పంట కోతకు వచ్చింది. మూడు రోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం పడుతుందోనని ఆందోళనలో ఉన్నాం. పంట కోయాలో వద్దో తెలియడంలేదు.
– జనార్దన్‌రెడ్డి, రైతు, నందారం
కారుమబ్బులు.. రైతన్న గుబులు


