TS Special:బాసర ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు

Minister Indrakaran Reddy At Assembly Session Said TS Government Allots Rs 50 Crores - Sakshi

మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, గంగాపూర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్‌రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

నిత్యకైంకర్యాలకు 3,645 ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, కామన్‌ గుడ్‌ఫండ్‌ నిధుల ద్వారా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ప్రస్తుతం రూ. 8.40 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో అతిథి గృహాలు, షెడ్స్, ప్రహరీగోడ ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

డిసెంబర్‌ 2021 నాటికి ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, మిగిలిన పనులను డిసెంబర్‌ 2022 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో రూ. 30 లక్షలతో గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో షెడ్స్, రోడ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. రూ. 50 లక్షల అంచనా వ్యయంతో గంగాపూర్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మండపం, విమాన గోపుర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

239.87 కోట్ల మొక్కలు నాటాం: ఇంద్రకరణ్‌ 
హరితహారంలో భాగంగా 2014–15 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రూ.6,555.97 కోట్లు రాష్ట్రంలో ఖర్చు చేసినట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఇప్పటివరకు 239.87 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అడవులున్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పచ్చదనం పెంచేందుకు ఎంపీ సంతో‹Ùకుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ చెట్లు నాటడానికే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, కానుగ చెట్ల పెంపకం అధికం చేయడంతోపాటు రోడ్ల వెంట ఇతర చోట కాయలు కాసే చెట్లకు అధికప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీ‹Ùకుమార్, సయ్యద్‌ అమీనుల్‌ జాప్రీ పాల్గొన్నారు.
 

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top