Gokula Tirumala Parijatha Giri: తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం, గోకుల తిరుమల పారిజాతగిరి

Gokula Tirumala Parijatha Giri History In Telugu At West Godavari District - Sakshi

జంగారెడ్డిగూడెం: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి ఏడుకొండల్లో వెలసినట్టే ఇక్కడ పారిజాతగిరివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. భక్తుల అభీష్టాలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతూ భక్తులతో నిత్యపూజలందుకుంటున్నాడు. తిరుపతిలో జరిగే బ్రహ్మోహత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు సైతం ఇక్కడ శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిలో నిర్వహిస్తున్నారు.

దీంతో పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానమంతా ప్రాశస్త్యం నెలకొంది. జాతీయ రహదారి ఆనుకుని ఆహ్లాదకరమైన పరిసరాలతో ప్రశాంత వాతావరణంలో సర్వాంగ సుందరంగా తీర్చదిద్దబడిన శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్దిగాంచింది.


జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్లే దారి ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌

చరిత్ర:
చిట్టియ్య అనే భక్తునికి వేంకటేశుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరమున ఉన్న కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారని, ఆ విధంగా చిట్టియ్య అన్వేషించగా, ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వక్షము కింత స్వామి వారి పాదాలు గల శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభీష్టాలు తీర్చుతూ ఆలయం దినదినప్రవర్ధమానమైంది. పాడిపంటలు కలిగిన ప్రదేశం గాన గోకుల మని, పారిజాతగిరి వక్షలుము కొండపై ఉన్నవి గాన పారిజాతగిరి అని, వేంకటేశుడు కొలువై ఉన్నందున తిరుపతి అని గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్దిగాంచింది. 


జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం

ఆత్మప్రదక్షణతో పుణ్యం:
ఆత్మ ప్రదిక్షణతోనే ఎంతో పుణ్యం సంపాదించవచ్చని పెద్దలు చెబుతున్నారు. అటువంటిది శ్రీనివాసుడు కొలువైన గిరి చుట్టూ ప్రదిక్షణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందో. అటువంటి అవకాశం పారిజాతగిరి భక్తులకు కలగనుంది. ఆగమశాస్త్రం ప్రకారం గిరిచుట్టూ ప్రదిక్షణలు చేయడం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పుణ్యఫలాన్ని భక్తులకు అందించేందుకు స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పేరిచర్ల జగపతిరాజు, కార్యదర్శి కాకాని శ్రీహరిరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి గోకుల పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ గిరిప్రదిక్షణ తాత్కాలిక రోడ్డును నిర్మిస్తున్నారు. ఆరవ కొండకు ఎదురుగా కొద్ది దూరంలో గరుడకొండ ఉంది. 

ఏడుకొండవాసుడు:
రాష్ట్రంలో ఏడుకొండలపైన వెలసిన తిరుమల వెంకటేశ్వరుడు కాగా, రెండవది పారిజాతగిరివాసుడు. ఒక కొండ వెనుక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడు పాదపద్మాలు అవతరించాయి. దీంతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడకొండ ఉంది. ఏడుకొండల్లో శేషాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి, వృషభాద్రి ఏడుకొండలు ఇక్కడ ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరస్వామికి ఉన్నంత ప్రత్యేకత ఈ స్వామి వారికి ఉంది. 


జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారు

ప్రదిక్షణ విశిష్టత:
దేవాలయ ప్రదిక్షణకు విశేష ఫలితం ఉంటుంది. దేవాలయం చుట్టూ ప్రదిక్షణ చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని భక్తులు గ్రహించడం ద్వారా పునీతులవుతారని భక్తుల నమ్మకం. అయితే గిరులన్నీ ప్రదిక్షణం చేయడం మరింత పుణ్య ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రం చెబుతోంది. గిరి ప్రదిక్షణ చేయడం ద్వారా మరింత పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు వెలిసిన ప్రదేశానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. 

దాతల సహకారంతో గిరి ప్రదిక్షణ రోడ్డు నిర్మాణం:
దాతల సహాకారంతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల మేర 30 లక్షల రూపాయల వ్యయంతో తాత్కాలిక రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి కొంత మద్ది ఆంజనేయస్వామి దేవాలయం నుంచి కూడా ఆర్ధిక సహాయం అందించనున్నారు. రోడ్డు నిర్మాణం పూరై్తన తరువాత కొండ చుట్టూ ప్రత్యేకంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయి శాశ్వత రోడ్డును వేయనున్నారు.

గిరి ప్రదిక్షణ రోడ్డు ఏర్పాటు చేయడంపై భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ తరహా గిరి ప్రదిక్షణ రోడ్డు సుప్రశిద్ధ దేవాలయాలు అరుణాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. కాగా ఈ ఆలయంలో ప్రతీ శనివారం అన్నదాన కార్యక్రమం, మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయ గాలి గోపురం నిర్మాణం వేగంగా సాగుతోంది. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేట్టుగానే పారిజాతగిరికి కూడా మెట్ల మార్గం ఉంది.

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top