గంపజాతర: గ్రామాన్ని కాపాడే విశ్వాస సంప్రదాయం | gampajatara village tradition | Sakshi
Sakshi News home page

గంపజాతర: గ్రామాన్ని కాపాడే విశ్వాస సంప్రదాయం

Mar 22 2026 12:17 PM | Updated on Mar 22 2026 12:19 PM

gampajatara village tradition

ఇళ్లకు తాళాలు.. రోజంతా వనవాసాలు 

పిల్లాపాపలు,  బంధుమిత్రులతో కలిసి విందులు  

ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ  

అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం 

ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు.

ఉదయం వెళ్లి.. సాయంత్రం రాక 
ప్రతి సంవత్సరం గంప జాతర పేరుతో గ్రామాన్ని వదిలి చెట్లకింద గడిపి పొద్దు పోయాక ఇళ్లకు చేరుకుంటే అంటురోగాలు, దారిద్య్రం దరిచేరవని ప్రజల నమ్మకం. గంప జాతర కార్యక్రమాన్ని ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. నిర్ణయించిన ప్రకారం ఆ రోజు తెల్లవారుజామునే లేచి వంటపాత్రలు గంపలో పెట్టుకొని గ్రామంలో ఎవరూ ఉండకుండా ఇళ్లకు తాళం వేసి వెళ్తారు. కాలకృత్యాలు సైతం ఊరు బయటనే తీర్చుకుంటారు. తిరిగి సాయంత్రం ఇళ్లకు వచ్చి శుద్ధి చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ఆ రోజు ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తీర్మానిస్తారు.

ఆ తర్వాతే పొలం పనులు.. 
గ్రామాల్లో ఆచారంగా వస్తున్న గంపజాతర కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే పొలం పనులు మొదలుపెడతారు. వర్షాలు కురువక ముందే గంపజాతర జరుపుకొంటారు. గంపజాతర నిర్వహించిన తర్వాత పంటలు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకుంటారు.

గతంలో వర్షాల కోసం.. 
మూడు నాలుగు దళాబ్దాల క్రితం వరకు గంపజాతరను అన్ని గ్రామాల్లో జరుపుకొనేవారని పెద్దలు చెబుతారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామాల్లో గంపజాతర నిర్వహించేవారని పేర్కొంటున్నారు. ఉదయం తెల్లవారక ముందే లేచి ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలేవారని, కాకపోతే చెట్ల కిందకు కాకుండా అడవిలోకి వెళ్లి ప్రకృతిని పూజించే వారని చెబుతున్నారు. గట్టిగా ఏడ్వడం, బాధ పడటం వంటివి చేసేవారని, తినడానికి మంచి ఆహారం కాకుండా చింతపండు, ఉప్పు, కారం వంటివి తీసుకెళ్లేవారన్నారు. రోజంతా అడవిలో బాధపడుతూ వర్షాలు కురవాలని ప్రకృతిని పూజించి సాయంత్రం ఇళ్లకు చేరుకునే వారని చెబుతున్నారు.

క్రమంగా ఆచారంలో మార్పులు 
గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. 

జడ్చర్ల మండలం గంగాపూర్‌ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు  తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు.

ప్రతిఏటా నిర్వహిస్తాం.. 
గంపజాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒకరోజు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే కొన్నిరకాల రోగాలు దరిచేరవనే నమ్మకం అందరిలో ఉంది. అంతేకాకుండా గంపజాతర నిర్వహిస్తూ చెట్ల కింద ఆనందంగా గడపడానికి కూడా ప్రజలు దీన్ని నిర్వహిస్తున్నారు. 
– శిర్ప రవి, వేపూరు గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా 

గ్రామస్తుల ఇష్టం మేరకే.. 
గ్రామస్తుల ఇష్టం మేరకే గంపజాతర నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయిస్తాం. ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తోంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గ్రామంలో ప్రజలందరూ గంపజాతరకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నారు. 
– శ్రీదేవి, మాజీ సర్పంచ్, షేక్‌పల్లి, హన్వాడ మండలం, మహబూబ్‌నగర్‌ జిల్లా

విపత్కర పరిస్థితులు రావు.. 
గ్రామంలో గంపజాతర నిర్వహిస్తే అనుకోని విపత్కర పరిస్థితులు ప్రజలకు రావని, దారిద్య్రం, అంటురోగాలు రావని ప్రతి సంవత్సరం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నిర్వహిస్తారు. గంపజాతర నిర్వహించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతాం. గంపజాతర నిర్వహించకపోతే గ్రామంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. 
– శ్రీకాంత్, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్‌ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement