తిరుపతి మంగళం : సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అసమర్థత వల్లే మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, వపన్‌కళ్యాణ్‌లు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. మామిడి కిలోకి రూ.15 గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ పెట్టిన కూలీలు కూడా రావని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. గిట్టుబాటు ధర లేక సుమారు 2లక్షల టన్నుల మామిడి కాయలు చెట్ల కింద రాలి కుళ్లిపోతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కిలోకి రూ.4 ధర ప్రకటించి చేతులు దులుపేసుకుందని మండిపడ్డారు. ఫల్ఫ్ ఫ్యాక్టరీల వద్ద మామిడి లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ రైతులకు రూ.250 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో కిలోకి రూ.20 నుంచి రూ.25 ధర కల్పించిన ఘనత జగనన్నదేనన్నారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.


