కబ్జా భూమికి దర్జాగా అప్రూవల్‌ | - | Sakshi
Sakshi News home page

కబ్జా భూమికి దర్జాగా అప్రూవల్‌

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

అవిలాలలో వివాదాస్పద భూమికి తుడా ఫైనల్‌ అప్రూవల్‌కు వేగంగా అడుగులు రికార్డులు పరిశీలించకుండానే టీఎల్‌పీ అధికార పార్టీ సిఫార్సుతో తుడా అత్యుత్సాహం

తిరుపతి తుడా: చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ అవిలాలలో రాష్ట్ర మంత్రితో పాటు ఓ ప్రజా ప్రతినిధి రూ.100 కోట్ల భూకబ్జా బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తప్పుడు పత్రాలతో నిషేధిత జాబితా నుంచి తొలగించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యవహారం భూ కబ్జాకు కొత్త నిర్వచనం చెప్పింది. ఈ భారీ ల్యాండ్‌ గ్య్రాబింగ్‌ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. హక్కులేని 35 మందిని ఫ్యామిలీ ట్రీగా సృష్టించి వారి చేత కై కలూరుకి చెందిన విష్ణు శివనాగప్రసాద్‌ పేరుతో 3.17 ఎకరాల ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడు అశోక్‌ రెడ్డి పేరుతో జీపీఏ చేయించుకున్నారు. తద్వారా ఓ డెవలపర్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేయించడం ద్వారా లింక్‌ డాక్యుమెంట్లను ఆగమేఘాలపై సృష్టించారు. తుడా అప్రూవల్‌కు అవసరమైన లింకు డాక్యుమెంట్లను సృష్టించి సమర్పించడంతో వెంచర్‌ అనుమతులకు అడ్డు లేకుండా చేసుకున్నారు. ఆ రికార్డులను కనీసం పరిశీలించకుండా తుడా ప్లానింగ్‌ అధికారులు చకచకా ప్రాథమిక అప్రూవల్‌ను మంజూరు చేశారు. ఫైనల్‌ అప్రూవల్‌కు సైతం రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను, రిజిస్ట్రేషన్‌ చేసిన 35 మందికి సంబంధించిన ఆధార్‌ కార్డులు, ఫ్యామిలీ, ఇతర వెరిఫికేషన్‌ లేకుండానే సబ్‌ రిజిస్ట్రార్‌ అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్‌ చేసేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో తుడా అధికారులు వివాదాస్పద భూమికి సంబంధించి అప్రూవల్‌ను ఇచ్చేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. భూ ఆక్రమణపై బాధిత కుటుంబం చట్టపరంగా ముందుకు వెళుతోంది.

ఫైనల్‌ అప్రూవల్‌కు వేగంగా అడుగులు

భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారంలో ఓ ప్రజా ప్రతినిధి తలమునకలై రికార్డులను తారుమారు చేస్తూ పక్కా ప్లాన్‌ తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో తుడా ఫైనల్‌ అప్రూవల్‌ కోసం అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తుడా అధికారుల అంతే వేగంగా అనుమతులు ఇచ్చేందుకు చకచకా చర్యలు చేపట్టారు. 2022లో ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్‌, ఆర్డీవో ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని రిజిస్ట్రేషన్‌ అడ్డుకొని 100 కోట్ల భూమిని కాపాడారు. ఈ భూమిని 22 ఏ లోనే కొనసాగించారు. అధికారం మారడంతో తహసీల్దార్లు 22 ఏ నుంచి ఈ భూమిని తొలగించి రిజిస్ట్రేషన్లకు అవసరమైన రికార్డులను సృష్టించడంలో భాగస్వాములయ్యారు. ఆక్రమణలో సబ్‌ రిజిస్ట్రార్‌ తో పాటు రెవెన్యూ అధికారులు అండదండలు అందించడంతోనే అక్రమ భూమిని సక్రమంగా మార్చేశారు. అదే తప్పును తుడాను చేస్తుండడంతో భవిష్యత్తులో బోనెక్కక తప్పదని బాధితులు పేర్కొంటున్నారు.

మీ భూములు రికార్డుల్లో ఉన్నాయో లేవో సరి చూసుకోండి

చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములకు గ్యారెంటీ లేకుండా పోయింది. భూ ఆక్రమణులు పెచ్చుమీరాయి. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేవా అని రెవెన్యూ లో పరిశీలించుకోవాలి. అవిలాలలో 3.17 ఎకరాల భూ కబ్జా వ్యవహారంలో రెవెన్యూ , సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు తుడా అధికారులను దోషులుగా నిలబెడతాం. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ను ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు. వెంచర్‌కు అనుమతులు ఇస్తున్న తుడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

– చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement