దొరవారిసత్రం : గత టీడీపీ హయాంలో ఎన్‌టీఆర్ జలసిరి కింద రైతుల కోసం పంట పొలాల్లో రూ.లక్షలు వెచ్చించి సోలార్ ప్యాన్‌లు ఏర్పాటు చేశారు. వీటిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో పొలాల్లో దిష్టిబొమ్మలా మారాయి. దొరవారిసత్రం మండల పరిధిలోని వేణుంబాకం, కల్లూరు, వెదురుపట్టు పంచాయతీల్లో మాత్రమే 100కి పైగా సోలార్ ప్యానల్స్ నిరుపయోగంగా మారాయి. సోలార్ ప్యానళ్లు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రేణిగుంట: రేణిగుంటలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం స్పృహ తప్పి పడి ఉండగా, స్థానికుల సమాచారంతో 108 అంబులెనన్స్ ద్వారా చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు లేదా అతడి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే, వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడి మృతి
తిరుపతి క్రైం : తిరుపతి రైల్వేస్టేషన్ పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుచానూరు వైపు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న యాలమూరి వైనన్స్ సమీపంలోని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని యువకుడు (వయస్సు సుమారు 25–30 సంవత్సరాలు) రైలు కిందపడి మృతి చెందినట్లు సమాచారం. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి రైల్వే పోలీస్ ఇన్‌న్‌స్పెక్టర్ వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేదా చిరునామాకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజ్ మార్చురీకి తరలించి భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తిరుపతి రైల్వే పోలీసులను 92475 75618 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మోటార్లు, స్టార్టర్లు చోరీ
కేవీబీపురం: మండలంలోని కోవనూరులో కృష్ణయ్య, పోలయ్య, చెంగయ్య అనే రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలంలో మోటార్లు, పైపులు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయి. అప్పులు చేసి పంటలు వేస్తే దొంగలు వరుసగా మోటార్లను, పైపులను, స్టార్టర్లను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. ఏటా దొంగలు మోటార్లు స్టార్టర్లను దొంగతనం చేయడం వల్ల సకాలంలో పంటలు పెట్టుకోలేకపోతున్నామని వాపోయారు. లక్ష రూపాయలు విలువ చేసే మోటార్లను దొంగతనం చేయడం వల్ల సకాలంలో మోటర్లు బిగించుకోలేక పంటలు ఎండబెట్టుకుంటున్నామని తెలిపారు. అధికారులు, పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని మాజీ సర్పంచ్ పెంచలయ్య తెలిపారు.
ఏనుగుల దాడిలో
ఒకరి మృతి
పాకాల : వ్యవసాయ పొలం వద్ద ఉన్న వ్యక్తిపై ఏనుగులు దాడిచేసి చంపేసిన సంఘటన మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇ.పాలగుట్టపల్లి పంచాయతీ దేవినేని ఇండ్ల గ్రామానికి చెందిన కె.తిమ్మారెడ్డి(65) గురువారం రాత్రి తన వరి పొలం వద్దకు వెళ్లాడు. తిరిగి అతను ఇంటికి రాకపోవడంతో శుక్రవారం రాత్రి స్థానికులు తిమ్మారెడ్డి పొలం దగ్గర వెతికారు. తిమ్మారెడ్డి శరీర భాగా ముక్కలు ముక్కలుగా పడి ఉండడాన్ని గమనించారు. ఏనుగుల గుంపు దాడిచేసి చంపేసినట్టు తెలుసుకున్నారు. తిమ్మారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బతుకుదెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్లారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల రాకపోకలు గుర్తించలేకపోవడంతోనే ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
సంస్కృత భాషాభివృద్థికి
సహకరించండి
తిరుపతి సిటీ: భావిభారతానికి సంస్కృత ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఎన్‌ఎస్‌యూ కృషిచేస్తోందని అందుకు మరింత సహకారం అవసరమని వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి విన్నవించారు. శుక్రవారం తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు శరత్‌చంద్రను విజయవాడలో కలిసి వినితిపత్రం సమర్పించారు. సంస్కృత భాషాభివృద్ధికి వర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమని, అకాడమీ ద్వారా సంస్కృత బాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పినట్లు అధికారులు తెలియజేశారు.


