తిరుపతి అర్బన్: సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో భాగంగా బీఎల్వోలు కచ్చితంగా ఇంటింటికు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుచానూరులోని శంకర్ నాయుడు కాలనీ, ముత్యాలమ్మ గుడివీధి, వసుంధరనగర్‌తో పాటు తిరుపతిలోని ఆటోనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ పనితీరుపై ఓటర్లను సంప్రదించారు. మీ ఇంటికి బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో) వచ్చారా అమ్మా....మీకు ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారా తల్లీ అంటూ ఓటర్లతో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇచ్చి ఉంటే వాటిని తప్పులు లేకుండా కచ్చితమైన సమాచారంతో పూరించి తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇవ్వకుంటే తప్పకుండా బీఎవ్వోలు మీకు అందిస్తారని స్పష్టం చేశారు. అలాగే బీఎల్‌వ్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్వోలకు ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్‌రాజు, ఎన్నికల డీటీ,బీఎల్వోలు ఉన్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యపై ప్రత్యేక శ్రద్ధ
తిరుపతి ఆటోనగర్‌లో కలెక్టర్ పర్యటన సందర్భంగా ఓటర్ల సవరణ ప్రక్రియతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యంపై స్థానికులతో మాట్లాడారు. కలెక్టర్‌తోపాటు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి ఉన్నారు. ప్రతి రోజు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని, అలాగే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ప్రతి నెలా పింఛన్లు అందుతున్నాయా అంటూ కలెక్టర్ ఆరా తీశారు. మున్సిపల్ ఉప కమిషనర్ అమరయ్య, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు, ఎలక్షన్ డీటీ సుధాకర్ నాయక్ రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


