వేరుశనగ కాయలు లేనట్టేనా? | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ కాయలు లేనట్టేనా?

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● రబీలో రేట్లు పెరిగాయంటూ నిలుపుదల ● ఈ సారి సాగులేదంటూ మెలిక ● విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతులు

తిరుపతి అర్బన్‌: ‘వరి వద్దు.. చెరుకు సాగుచేయొద్దు.. మామిడికి రేటు ఉండదు కాబట్టి సాగు తగ్గిస్తే మంచిది..’ అంటూ ఈ మధ్య సీఎం చంద్రబాబునాయుడు ఉచిత ప్రసంగాలు దంచేస్తున్నారు. కానీ కష్టాన్నే నమ్ముకుని.. చెమటను అమ్ముకుని జీవిస్తున్న అన్నదాత పుడమిపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న పంటలను సరికొత్త పద్ధతులతో సాగు చేస్తూ పది మందికీ పట్టెడన్నం పెట్టగలుగుతున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సాధారణ పంటలేవీ సాగు చేయొద్దంటూ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల వరకు ఉచిత సలహాలు ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఎరువులు, విత్తనాల కొరత కారణంగా కాడిని పక్కన పడేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటిదే జిల్లాలోని చాలా మండలాల్లో కొనసాగుతోంది. ఖరీఫ్‌లో ప్రధాన పంట అయిన వేరుశనగ విత్తేందుకు విత్తనాలు దొరక్క అల్లాడాల్సిన వస్తోంది. సీజన్‌ ముగుస్తున్నా సాగులేదంటూ కొత్తమెలిక పెట్టి విత్తనాలు ఇవ్వకుండా చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది.

సబ్సిడీ విత్తనాలకు పంగనామాలు

గత రబీ సీజన్‌లో వేరుశనగ కాయల రేట్లు పెరిగాయని.. 50 శాతం రాయితీతో విత్తనాలు ఇవ్వలేమంటూ సర్కార్‌ చేతులెత్తేసింది. విధిలేని పరిస్థితుల్లో రైతులు కేజీ విత్తనాలు రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేసి సాగుచేశారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో జిల్లాలో పెద్దగా సాగుచేసే వారు లేరంటూ విత్తనాలు ఇవ్వడం మానేశారు. ముందుగా ఇస్తామంటూ నెలరోజులు గడిపిన అధికారులు ఇప్పుడు సాగు లేదంటూ చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. ఎకరం సాగుకు 50 కిలోల విత్తనాలు అవసరం. ఈలెక్కన బయట కొనాలంటే రూ.6 వేల వరకు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. అదే రాయితీ విత్తనాలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు.

సీజన్‌ ముగిస్తోంది

సాధారణంగా ప్రతి ఏటా జూన్‌ మొదటి వారం నుంచి చివరి వారం లోపు ఖరీప్‌ సీజన్‌లో వేరుశనగ విత్తుతుంటారు. కానీ విత్తనాలు లేకపోవడంతో చాలా మంది రైతులు దుక్కులు దున్ని సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అధికారులు సాగు మెలిక పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement