విచారణ సాగదీత! | - | Sakshi
Sakshi News home page

విచారణ సాగదీత!

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● ఎస్వీయూ నకిలీ చలానాలపై మళ్లీ విచారణకు ఆదేశం ● అసలు నిందితులను వదిలిపెడితే ఊరుకోం ● ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక

తిరుపతి సిటీ: ఎస్వీయూలో నకిలీ చలానాల వ్యవహారానికి చరమగీతం పాడే విధంగా బాధితులపై చర్యలు తీసుకుంటారని ఊహించిన ఉద్యోగులు, విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు 10 మందికి నోటీసులు జారీ చేసి వివరణ కోరిన కమిటీ బృందం అసలు నిందితులను వదిలేసి ఓ శాశ్వత ఉద్యోగి కారణమంటూ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు 2026 జనవరి నుంచి కేవలం 35 చలానాలు మాత్రమే నకిలీవిగా గుర్తించిన వర్సిటీ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నకిలీ చలానాలో భాగస్వామ్యులైన పలువురు ఉద్యోగుల నుంచి వివరణ కోరగా వారు ఈ ప్రక్రియ గతేడాది నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

2025 నుంచి మళ్లీ విచారణకు ఆదేశం

విద్యార్థుల ఫీజు చలానాలో అవినీతికి పాల్పడిన వ్యవహారంపై ఉద్యోగులను విచారించిన అధికారులు అసలు నిందితులను తప్పించేందుకు పక్కా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరం ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే వద్దకు వెళ్లడంతో ఎస్వీయూ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. విచారణను మళ్లీ కొనసాగించేందుకు నిర్ణయించారు. నకిలీ చలానాల వ్యవహారాన్ని సాగదీసే ఉద్దేశంతో 2025 జనవరి నుంచి విద్యార్థుల చెల్లించిన ఫీజు చలానాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్వీయూ ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం

అసలు నిందితులను తప్పిస్తే ఊరుకోం

నకిలీ చలానా విషయంలో అధికారులు పారదర్శకతతో వ్యవహరించాలి. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అసలు నిందితులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై చర్యలు తీసుకుంటే సహించేది లేదు. ఈ వ్యవహారంలో వర్సిటీకి సంబంధించిన నకిలీ రబ్బర్‌ స్టాంపులు ఎవరు తయారు చేసి, ఎక్కడ తయారు చేశారు. ఈ నకీలీ చలానాల నగదు ఎవరికి ముట్టింది అనే విషయాలపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి అసలు నిందితులను గుర్తించాలని ఎస్వీయూ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement