జూలై 1న హీరో పరిశ్రమకు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

జూలై 1న హీరో పరిశ్రమకు సీఎం రాక

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● హీరో పరిశ్రమ రెండో దశ విస్తరణపనులకు భూమిపూజ ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ , ఎస్పీ

● హీరో పరిశ్రమ రెండో దశ విస్తరణపనులకు భూమిపూజ ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ , ఎస్పీ

వరదయ్య పాళెం: సత్యవేడు మండలం మాదనపాళెం ఏపీఐఐసీ సెజ్‌ పరిధిలోని హీరో మోటోకార్ప్‌ పరిశ్రమ రెండవ దశ విస్తరణ పనులకు జూలై 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు హీరో పరిశ్రమను సందర్శించి ముందస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంపెనీ యాజమాన్యంతో కలిసి సీఎం పర్యటన రూట్‌ మ్యాప్‌, భూమిపూజ కార్యక్రమ స్థలం, వాహనాల పార్కింగ్‌, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బరాయుడు పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హీరో కంపెనీ తయారు చేసిన విడ ఎలక్ట్రిక్‌ బైక్‌ను అధికారులు పరిశీలించారు. రెండవ దశ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు చక్రవర్తి, కిరణ్‌ కలెక్టర్‌కు వివరించారు. సీఎం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రొటోకాల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన ట్రాఫిక్‌ మళ్లింపు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్‌ వెంట సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్‌ రెడ్డి, ఏఎస్పీ రవి మనోహరాచారి, శ్రీసిటీ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌ సంక్షేమ పనులకు శంకుస్థాపన

తిరుపతి క్రైం : రాష్ట్ర పోలీస్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) హరీష్‌ కుమార్‌ గుప్తా శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సంక్షేమానికి సంబంధించిన పలు మౌలిక వసతుల నిర్మాణాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పోలీస్‌ వెల్ఫేర్‌ క్యాంటీన్‌, ప్రధాన ప్రవేశ ద్వారం (గ్రౌండ్‌ గేట్‌), కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూదన్‌ రెడ్డి, డీజీపీ సతీమణి, జిల్లా పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా అధ్యక్షతన జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీస్‌ సంక్షేమం, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ జిల్లాలో అమలవుతున్న పోలీసింగ్‌ విధానాలు, పరిపాలనా చర్యలు, ప్రజా భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణలో జిల్లా సైబర్‌ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని డీజీపీ ప్రశంసించారు.

బీసీ సహాయ సంక్షేమాధికారిగా పల్లా వెంకటేశ్వర్లు

ఏర్పేడు: గత 35 ఏళ్లుగా వసతి గృహ సంక్షేమ అధికారిగా పనిచేస్తూ ఎన్నో వందల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఏర్పేడు బీసీ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పల్లా వెంకటేశ్వర్లు జిల్లా బీసీ సహాయ సంక్షేమాధికారిగా పదోన్నతి పొందారు. విద్యార్థిగా ప్రభుత్వ వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదివిన ఆయన పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించడంలో ఎంతో కృషి చేశారు. గతంలో ఏర్పేడు హాస్టల్లో తన సొంత నిధులతో సైన్స్‌ల్యాబ్‌ ను ఏర్పాటు చేశారు. పదోన్నతిపై శ్రీకాళహస్తి సహాయ బీసీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement