తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 62,925 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,297 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
టీటీడీకి రూ.45 లక్షల విరాళం
తిరుమల: హైదరాబాద్‌కు చెందిన సాయి బాలాజీ డెవెలపర్స్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది. ఈమేరకు ఆ సంస్థ భాగస్వామి ఆకుల రవికుమార్ తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


