యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో అరణియార్ నది నేడు అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వ అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాల వల్ల నది గుండె కోతకు గురై, మొత్తం గుంతలమయంగా మారిపోతోంది.
ప్రాణాలకే ముప్పు
నదిలో 15 నుంచి 20 అడుగుల లోతున తీసిన గుంతల వల్ల పశువులు, పిల్లలు ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇటీవలే ఆంబాకం, ఎస్‌ఎస్‌బీపేట వద్ద పలుచోట్ల ఇసుక తవ్వకాల వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో ఈ గుంతల్లో నీరు నిలిచి సుడులు తిరుగుతూ మనుషులను మింగేసే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరిక బోర్డులు గానీ, రక్షణ చర్యలు గానీ కనిపించడం లేదు.
మౌనంగా ఉన్న యంత్రాంగం
పట్టపగలే టిప్పర్లు, హిటాచీలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా ఇంత బహిరంగంగా దోపిడీ సాధ్యమా?’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రైతుల పాలిట శాపం
విచ్చలవిడి తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నది పరివాహక ప్రాంతంలోని బోర్లు, బావులు ఎండిపోయాయి. రైతులు వ్యవసాయానికి దూరమయ్యే దుస్థితి దాపురించింది. ‘ప్రభుత్వం ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తూ మా బతుకులు నాశనం చేస్తోంది’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోతున్నారు. ఇసుక తీయడం వల్ల నది గర్భం లోతుగా మారి, గట్లు బలహీనపడనున్నాయి. ఒక్క వరదకే పొలాలు నదిలో కలిసిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


