2002 తరువాత పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడళ్లకు చిక్కులు అటువంటి వారి నుంచి ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ తీసుకోని బీఎల్వోలు | - | Sakshi
Sakshi News home page

2002 తరువాత పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడళ్లకు చిక్కులు అటువంటి వారి నుంచి ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ తీసుకోని బీఎల్వోలు

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

● పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, కుటుంబం వివరాలు తెస్తేనే! ● గిరిజన మహిళా ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం

● పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, కుటుంబం వివరాలు తెస్తేనే! ● గిరిజన మహిళా ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్లకు ఎదరువుతున్న పరిణామాలు కుటుంబీకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 2002 తరువాత వివాహమైన మహిళలకు సంబంధించి ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ని బీఎల్వోలు తీసుకోవడం లేదు. అటువంటి వారి ఓటు మ్యాపింగ్‌ చేయాలన్న వివరాల గురించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వారు చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ఇంటికి వచ్చి కోడళ్ల ఓట్లపై కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇందులో నిరక్షరాస్యులుగా ఉన్నటు వంటి వారి ఓట్లు ఉంటాయా? తొలగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2002 తరువాత అదనంగా 5.5 లక్షల మందికిపైగా కొత్త ఓటర్లు ఉన్నారు. వీరిలో 65 శాతం మందికిపైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో కనీసం అంటే 50 శాతం మంది ఓటర్లు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వచ్చి ఉంటారని అధికారుల అంచనా. వీరంతా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్‌ చేసుకోవాలంటే సమస్యలు ఎదురువుతున్నట్లు బీఎల్వోలు చెబుతున్నారు.

పుట్టింటి ఆధారాలు తప్పని సరి

మెట్టినింటికి వచ్చిన మహిళలు ఓటరు జాబితాలో ఉండాలంటే పుట్టింటి ఆధారాలు చూపించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వచ్చినప్పుడు కోడళ్ల వివరాలు అడుగుతారు. వివాహానికి ముందు వారి స్వగ్రామంలో వారి తల్లిదండ్రుల ఓట్లకు సంబంధించిన జాబితాను తీసుకొస్తే ఆ ఓటుకు ఇక్కడ ఉన్న మహిళ (కోడళ్లు) ఓట్లను మ్యాపింగ్‌ చేస్తామని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి మహిళలు, గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున జాబితాలో ఉండే అవకాశం లేదని కొందరు బీఎల్వోలు స్పష్టం చేశారు. ఎందుకంటే అటువంటి వారి వద్ద ఓట్లకు సంబంధించిన జాబితా ఉండే అకాశం లేదని తెలుస్తోంది.

గిరిజన మహిళా ఓటర్లకే చిక్కులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.59 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. వీరిలో 80వేల మంది మహిళా ఓటర్లే. గిరిజనులు ఎక్కువ శాతం మంది ఒకే చోట నివాసం ఉండే అవకాశం లేదు. జీవనం కోసం తరచూ ఊర్లు, జిల్లా మారుతుంటారు. ఇదిలా ఉంటే.. గిరిజనుల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు. ఈ రెండు పరిణామాలతో వీరి ఓట్లు మ్యాపింగ్‌కి నోచుకునే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ‘సర్‌’ కార్యక్రమం కారణంగా ఎవరి ఓట్లు ఉంటాయో..ఎవరివి ఎగిరిపోతాయోననే జనం ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement