వైద్యశాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైద్యశాల ప్రారంభం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–2లో ఆధునీకరించిన వైద్యశాలను టీటీడీ గురువారం ప్రారంభించింది. భక్తులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు డిస్పెన్సరీలో ఈసీజీ, ఆక్సిజన్‌ సదుపాయం, ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. నలుగురు వైద్యులు, 16 మంది పారా మెడికల్‌ సిబ్బంది సేవలందించనుండగా, 24 గంటల అంబులెన్స్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, సీఎంఓ డాక్టర్‌ కుసుమకుమారి, ఎస్‌ఎంఓ డాక్టర్‌ సుహర్‌లత, అశ్విని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి, డాక్టర్‌ పద్మజ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ఏఈవో మణి పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి తుడా:ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫిమేల్‌ ట్రైనింగ్‌ కోర్స్‌లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ అరుణ ఒక ప్రకటనలో కోరారు. తిరుపతిలోని రుయా హాస్పిటల్‌లో గల ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రైనింగ్‌ స్కూల్‌లో రెండేళ్ల కాలపరిమితితో ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దూర ప్రాంతాల వారికి హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంటుందన్నారు. సెప్టెంబర్‌ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకు రుయా అధికారిక వెబ్‌సైట్‌ను కానీ కళాశాల ప్రిన్సిపాల్‌ను గానీ సంప్రదించాలని కోరారు.

ఇంటర్‌ అడ్మిషన్లకు

30 వరకు గడువు

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు ఈనెల 30వ తేదీతో ముగియనున్నట్టు ఆర్‌ఐఓ జీ.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 72 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 2 వేలకు పైగా ప్రవేశాలు జరిగియన్నారు. గత ఏడాది కంటే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement