రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

తడ: స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ఒకటో ఫ్లాట్‌ఫామ్‌ నుంచి రెండో ఫ్లాట్‌ఫామ్‌కి మారుతున్న సమయంలో విజయవాడ నుంచి చైన్నెకి వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్టేషన్‌ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న సూళ్లూరుపేట జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని శరీరం గుర్తు పట్టలేని విదంగా నుజ్జు నుజ్జు కాగా మృతదేహంపై నీలం రంగు షర్టు మినహా మరెలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఆ మేరకు వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

నాగలాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వినోభానగర్‌లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వినోభానగర్‌ హరిజనవాడకు చెందిన సంపత్‌ (50) తాగునీటి కోసం సైకిల్‌పై రామగిరికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గం మధ్యలోని కృష్ణాపురం మలుపులోని స్పీడు బ్రేకర్‌ వద్ద పుత్తూరు వైపు వెళుతున్న ఓ లారీ వెనుక నుంచి సంపత్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో సంపత్‌ కిందపడగా, లారీ టైర్‌ తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోగా, లారీడ్రైవర్‌ పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తప్పిపోయిన బ్యాగు అప్పగింత

తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు వంగ మల్లేష్‌ గౌడ్‌ అలిపిరి చెక్‌పాయింట్‌ (స్కానర్‌) వద్ద తన బ్యాగును మరచిపోయారు. ఈ విషయమై మల్లేష్‌ గౌడ్‌ రాత్రి 11.30 గంటలకు తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సిబ్బంది సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం (టీజీ 07 ఏడీ 0269)ను గుర్తించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు బాలాజీ గెస్ట్‌ హౌస్‌ నంబర్‌ 4 వద్ద ఆ వాహనంలోని భక్తులను గుర్తించారు. వారిలో లక్ష్మీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ స్కానింగ్‌ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని తెలిపారు. అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతోపాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండడంతో, బ్యాగును వంగ మల్లేష్‌ గౌడ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా భక్తుడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతుడి భార్య కథనం మేరకు.. స్థానిక భారతీనగర్‌కు చెందిన ప్రదీప్‌(38) ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో శ్రీనివాసమంగాపురం ఆటో స్టాండ్‌లో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం శ్రీనివాసమంగాపురానికి చెందిన నవీన్‌ కుమార్‌తో పాటు కొంత మందితో కలసి ప్రదీప్‌ మద్యం సేవించాడు. ఆపై మీ భర్త గాయాలతో పడి ఉన్నాడని భాస్కర్‌ అనే వ్యక్తి ప్రదీప్‌ భార్య మీనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్త శ్రీనివాసమంగాపురం రైల్వే బ్రిడ్జ్‌ వద్ద మద్యం సేవించి వచ్చే క్రమంలో ఎద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు నవీన్‌ కుమార్‌ తెలిపాడని మృతుడి భార్య తెలిపారు. ప్రదీప్‌కు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రదీప్‌ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య తన భర్త మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు శాసనాలపై గుడిమల్లంలో పురావస్తుశాఖ సర్వే

ఏర్పేడు: దేశ చారిత్రక ఆధారాలను మరింతగా వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంలో ఏర్పేడు మండలం గుడిమల్లం నుంచి పుత్తూరు సమీపంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో ఆదివారం నుంచి సమగ్ర అధ్యయనం చేయనున్నట్ల కేంద్ర పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే తొలి శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న గుడిమల్లం ఆలయానికి అనుబంధంగా ఆ కాలం నాటి శిలాశాసనాలు ఇప్పటికే బయటపడగా, కొన్ని శాసన శిలలు ఆలయ ఆవరణలోనే ఉన్నాయి. అయితే గుడిమల్లం నుంచి సదాశివకోన రిజర్వాయర్‌ ప్రాంతంలో మరి కొన్ని విలువైన శాసన సంపద ఉన్నట్లు గుర్తించి, మైసూర్‌ నుంచి పురావస్తుశాఖ నిపుణుల బృందం, తిరుపతి పురావస్తుశాఖ అధికారి మునిరత్నంరెడ్డి, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఈ సర్వే చేపట్టనున్నారు. కేంద్ర పురావస్తుశాఖ నిపుణుల బృందంతోపాటు జిల్లా డీఎఫ్‌ఓ సాయిప్రసాద్‌, ఎఫ్‌ఆర్వో మాధవి వారి బృందంలో ఈ సర్వేలో పాల్గోనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement