జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా పలు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కనీస వసతులు కల్పించకుండానే భారీ ఫీజులు గుంజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
–శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్, జాతీయ కార్యదర్శి
అమ్మకాలు అరికట్టాలి
ప్రైవేటు విద్యాసంస్థలు అక్రమంగా విద్యాసామగ్రి విక్రయిస్తున్నాయి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ వద్దే యూనిఫామ్, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు తమకు నచ్చినచోట విద్యాసామగ్రిని తెచ్చుకునే సౌలభ్యం కల్పించాల్సి ఉంది. – అక్బర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఉల్లంఘనులపై చర్యలు తీసుకోండి
నిబందనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూల్స్‌పై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడానికి అధికారులకు పూర్తి బాధ్యతలు కట్టబెట్టాలి. ఈ స్కూల్ మనోళ్లది..ఆ స్కూల్ మవోళ్లది అనే తేడాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. – గార్లపాటి శ్రీధర్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక పీజులు వసూలు చేయడానికి వీలులేదు. విద్యాసామగ్రిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించకూడదు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాల్సిందే. మెరుగైన వసతులు కల్పించాల్సిందే. రూల్స్‌ను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ప్రతి స్కూల్‌ను మానిటరింగ్ చేస్తాం.
– కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి


