తొలిరోజు 50శాతం మందే హాజరు
పాత బ్యాగ్‌లు, యూనిఫాంతోనే పాఠశాలకు
ఈ ఏడాదైనా రవాణా చార్జీలు ఇచ్చేనా..?
మోడల్ స్కూల్స్ పేరుతో 345 ప్రైమరీ స్కూళ్ల గత ఏడాది విలీనం
3,4,5 తరగతులకు చెందిన విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మారుతున్న వైనం
బుడి బుడి అడుగులు
సర్కారు స్కూళ్లలో వసతుల లేమి.. పంపిణీకి నోచని విద్యార్థి కిట్లు.. అందని పాఠ్యపుస్తకాలు.. తల్లుల ఖాతాల్లో జమకానీ తల్లికివందనం వెరసి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఫలితంగా తొలిరోజు 50 హాజరు నమోదైంది.
తిరుపతి అర్బన్: కొత్త యూనిఫామ్, బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్‌ను ప్రభుత్వం అందించకపోవడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు తొలిరోజు అసంతృప్తి చెందారు. శుక్రవారం హజరుశాతం కేవలం 50 శాతం మాత్రమే నమోదైంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. సంపద సృష్టించడం తమకు మాత్రమే తెలుసంటూ ప్రతి సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న సీఎం చంద్రబాబు అభివృద్ధికి చెందిన ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు లోకేష్‌బాబుకి విద్యాశాఖామంత్రి పదవి కట్టబెట్టారు. అయితే పాఠశాలల ప్రారంభోత్సవం రోజే బ్యాగ్, షూ, బెల్ట్‌తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. అలాగే నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లికివందం సైతం తొలిరోజే జమ చేస్తామని వెల్లడించారు. అయితే ఆ ఊసేలేదు. దీంతో తొలి రోజు విద్యార్థులు పాత బ్యాగ్‌లతోనే అసంతృప్తిగా బడికి వచ్చారు. 50 శాతం మంది తొలి రోజు పాఠశాలకు దూరంగా ఉండిపోయారు. మరోవైపు యూనిఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్రమైన అంసతృప్తి వెలిబుచ్చారు. పాఠశాల తొలి రోజున పిల్లలకు చక్కెర పొంగళి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలి రోజు పెట్టకుండా వచ్చే సోమవారం అందిస్తామని వాయిదా వేశారు.
ఈ ఏడాదైనా రవాణా చార్జీలు ఇచ్చేనా?
గత ఏడాది ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల పిల్లలను విలీనం చేశారు. ఈ క్రమంలో తమ పాఠశాలను తమ ఊర్లోనే ఉంచాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రోజూ ఆటోలకు రవాణా చార్జీలు చెల్లించుకోలేక పలువురు పాఠశాలకు సక్రమంగా హాజరుకాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం రవాణా చార్జీలను దూరం ఆధారంగా రూ.2500 నుంచి రూ.3 వేలు ఏడాదికి విద్యార్థి తల్లి లేదా తండ్రి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అయితే గత ఏడాది 10 శాతం మందికి కూడా రవాణా చార్జీను చెల్లించలేదు. దీంతో ఈ ఏడాదైనా చెల్లిస్తారా? లేదా అనే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
చిరిగిన షూలతో
విద్యార్థులు
బడిఈడు పిల్లలు బడిలో ఉండేనా?
అసంతృప్తిగా బడికి...
బడిఈడు పిల్లలు బడిలో ఉండాలంటూ వేసవి సెలవుల్లో 36 రోజుల పాటు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రతి ఏటా మోడల్ స్కూళ్ల పేరుతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 3,4,5 తరగతుల పిల్లలను మోడల్ స్కూల్‌లో విలీనం చేయడంతో బడిఈడు పిల్లలు బడికి దూరంగా ఉండిపోతున్నారని చర్చసాగుతోంది. విలీనం ద్వారా డ్రాపౌట్స్ సంఖ్యను ప్రభుత్వం పెంచేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.


