చదువుల గుడి.. తడబడి | - | Sakshi
Sakshi News home page

చదువుల గుడి.. తడబడి

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

● సమస్యల స్వాగతం! ● నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం ● అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అధికారులు

ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణలో అవేమీ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో కళాశాలలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా సత్ఫలితాలు ఒనగూరడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల లేమి..శాశ్వత అధ్యాపకుల కొరత పట్టి పీడిస్తోంది. జేఈఈ, నీట్‌ శిక్షణ తదితర అంశాల అమలు తీరును పరిశీలిస్తే అంతులేని ఆవేదన మిగులుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి సిటీ: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సమస్యలతో సతమతవుతున్నాయి. శనివారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికుతున్నట్లే భావించాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలు లేమితో పాటు ఆశించిన స్థాయిలో ఇంటర్‌ ఫలితాలు రాకపోవడం, శాశ్వత అధ్యాపకుల కొరత, విద్యార్థులను జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సరైన శిక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలను చేర్పించేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం, నూతన సిలబస్‌కు అనుగుణంగా అధ్యాపకులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడంలో అధికారుల విఫలం తదితర సమస్యలు ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి.

వేధిస్తున్న అధ్యాపకుల కొరత

జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు 72 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల కొరత పీడిస్తోంది. అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు బట్టీ చదువులే గతిగా మారింది. ఒక్కో కళాశాలలో సింగిల్‌ డిజిట్‌ కూడా పర్మనెంట్‌ అధ్యాపకులు లేకపోవడం బాధాకరం. పలు కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రిన్సిపాళ్లను నియమించకపోవడంతో ఇన్‌చార్జిలతోనే కళాశాలలను నెట్టుకొస్తున్నారు.

తల్లికివందనం ఊసేలేదు!

ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యేనాటికి అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు గారడీ మాటలేనని తేలిపోయింది. ఈ ఏడాదికి సంబంధించి సెకండ్‌ ఇయర్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు చెల్లించాల్సిన తల్లికివందంపై ఇప్పటివరకు ఊసే ఎత్తకపోవడం విచారకరం. నూతనంగా కళాశాలల్లో ప్రవేశాలు పొందే ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు సైతం తల్లికి వందనం ఎప్పటికి దక్కుతుందో చెప్పలేమని అధికారులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొగ్గు చూపని తల్లిదండ్రులు

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపకపోవడంతో గత రెండేళ్లుగా ప్రవేశాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. జిల్లాలోని సుమారు 21 ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని గ్రూపుల్లో సింగిల్‌ డిజిట్‌కే ప్రవేశాలు పరిమితమవుతున్నాయి. అధికారులు అడ్మిషన్ల కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సంప్రదించినా విద్యార్థులు, తల్లిదండ్రులు వెనకడువేస్తున్నారు.

జిల్లా సమాచారం

కళాశాలల ద్వితీయ విద్యార్థుల

సంఖ్య సంవత్సరం సంఖ్య

ప్రభుత్వ జూనియర్‌

కళాశాలలు 21 1677

ఏపీఆర్‌జేసీ 1 107

ఎయిడెడ్‌ 1 336

ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ 10 629

ఏపీటీడబ్ల్యూఆర్‌ 3 239

బీసీ రెసిడెన్షియల్‌ 2 209

హైస్కూల్‌ ప్లస్‌ 23 601

కేజీబీవీ 4 151

ఏపీఎస్‌ఎస్‌ 5 365

వేసవి సెలవుల అనంతరం 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టెక్ట్స్‌బుక్స్‌తో పాటు స్టడీ మెటీరియల్‌ కిట్‌ను అందజేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో విఫలమవుతోంది. సీబీఎస్‌ఈ విధానంలో నూతన సిలబస్‌ను రూపొందించి సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌లోనే పుస్తకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. తూతూ మంత్రంగా పుస్తకాల పంపిణీ చేసి, అధికారులు చేతులు దులుపుకున్నారు. కళాశాలల భవనాలు, ఆర్వో ప్లాంట్‌ల శుద్ధి, మరుగుదొడ్లు, క్రీడాప్రాంగణాలను ప్రత్యేక నిధులతో వేసవి సెలవుల్లో మరమ్మతుల చేయాల్సి ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాలలకు వేసిన తాళం వేసినట్టే ఉండటం గమనార్హం.

టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు ఇద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. అధ్యాపకుల నియామకాలపై టీటీడీ దృష్టిపెట్టకపోవడం పేద విద్యార్థులు ఉచిత పుస్తకాల పంపిణీకి నోచుకోకపోవడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్పొరేట్‌ స్థాయి వసతులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కార్పొరేట్‌ విద్యా సంస్థలకు మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌ పూర్తి స్థాయిలో అందజేస్తాం. విద్యార్థుల సరిపడా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు గత ఏడాది కంటే పెరగనున్నాయి. ఇప్పటికే అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల జూన్‌ చివరి నాటికి పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి మెరిట్‌ స్కాలర్‌ షిప్‌లు, తల్లికి వందనం వంటి అన్ని సౌకర్యాలు విద్యార్థులు అందనున్నాయి

–జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement