అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

చంద్రగిరి: మంగళం క్వార్టర్స్‌ పంచాయతీ పద్మావతి నగర్‌లో టీటీడీకి చెందిన నిరుపయోగ భవన సముదాయంలో భవన నిర్మాణ కార్మికుడు శివయ్య(70) శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిరుపయోగంగా ఉన్న భవనంలో శివయ్య నుదుటిపై పెద్ద గాయమై విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. మృతుడు పచ్చికాపల్లం సమీపంలోని బలసలగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాలుగా మంగళం ప్రాంతంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడు శివయ్య మృతిపై హత్య కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

సినిమా షూటింగ్‌లకు అడ్డాగా ఎస్వీయూ

తిరుపతి సిటీ: రాయలసీమకు సరస్వతి నిలయంగా పేరుగాంచిన ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యంతో సినిమా షూటింగ్‌లకు అడ్డాగా మారుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీయూ ప్రాంగణంలో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతించకూడదనే నిబంధనలున్నా, వాటిని వర్సిటీ అధికారులు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రైవేటు కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూలో లా కళాశాల భవనాన్ని వర్సిటీ అధికారులు తమిళ సినిమా షూటింగ్‌కు కేటాయించడం దారుణమన్నారు. ఆ భవనాన్ని షూటింగ్‌ నిమిత్తం కేటాయించడంతో షూటింగ్‌ నిర్వహించే యాజమాన్యం కళాశాల భవనాన్ని ఉన్న నేమ్‌ బోర్డులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు షూటింగ్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

22 మందికి జరిమానా

తిరుపతి లీగల్‌: తిరుపతి రూరల్‌, తిరుచానూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్‌ స్థలంలో ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ఇతర నేరాలకు పాల్పడిన 22 మందికి రూ.1,41,900 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్‌ షేక్‌ కరీముల్లా మస్తాన్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. ఎంఆర్‌ పల్లి, తిరుచానూరు పోలీసులు 22 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement